సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2020 (19:01 IST)

ఎమ్మెల్యేనా మజాకా? ర్యాలీ చేశాడు కరోనా అందరికీ అంటించాడు.. ఎక్కడ?

కరోనా వైరస్ టెస్ట్
ఢిల్లీకి జమాత్ ప్రార్థనలు ఎలాగో.. చిత్తూరు జిల్లాకు శ్రీకాళహస్తి అలా మారిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపాల్సిన ఒక ప్రజాప్రతినిధి ఏకంగా ర్యాలీ నిర్వహించి కరోనాను వ్యాపింపజేశాడు. ఒకరిద్దరు కాదు పద్దెనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
చిత్తూరు జిల్లాలోనే మొట్టమొదటి పాజిటివ్ కేసు శ్రీకాళహస్తిలో నమోదైంది. అది కూడా లండన్ నుంచి వచ్చిన ఒక యువకుడికి పాజిటివ్ వచ్చింది. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి హోం క్వారంటైన్‌కు పంపారు. ఆ తరువాత ఢిల్లీ జమాత్ మసీదులకు వెళ్ళొచ్చిన వారి వల్ల కేసులు మొదలయ్యాయి. 
 
సరిగ్గా వారం క్రితం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏకంగా ఒక ర్యాలీ చేశారు. అది కూడా కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వానికి సహాయం చేసిన దాతల ఫోటోలను పెట్టుకుని ట్రాక్టర్లలో ఊరేగింపు చేశాడు. ఈ ర్యాలీకి ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు. అందులో ఢిల్లీ జమాత్ మసీదుకు వెళ్ళొచ్చిన ఒక వ్యక్తి కుటుంబ సభ్యురాలు కూడా ఉంది.
 
ఆమె ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కరోనా వైరస్ అంటుంకుంది. ఒకరిద్దరు కాదు ప్రస్తుతం నలభై ఆరు మంది పాజిటివ్ రోగులు ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉన్నారు. ఇది కాస్త ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. చేసిన తప్పును ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
తాను నిర్వహించిన ర్యాలీ వల్ల కరోనా రాలేదని బుకాయిస్తున్నారు. అయితే మూడవ దశ కరోనా వైరస్ వ్యాప్తిచెందకూడదని అనుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేపట్టిన ర్యాలీ వల్ల ఈ వైరస్ కాస్త వ్యాపిస్తుండటం స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.