సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (21:08 IST)

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కరోనా!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీనికి తార్కారణమే ఆరోగ్యపరంగా ఎంతో జాగ్రత్తగా ఉండే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కరోనా వైరస్ సోకడమే. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎస్‌ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు. 
 
ఈ మంగళవారం ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్‌తో  సోమేష్‌కుమార్‌ సమావేశమయ్యారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. 
 
ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్‌ సమీక్షల్లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు. 
 
మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. సోమవారం ఏకంగా 1,498 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితం బులిటెన్ విడుదల చేసింది. 
 
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735కు పెరగ్గా, మొత్తం మరణాల సంఖ్య 1,729కి చేరుకుంది.
 
అలాగే, 3,03,013 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,993 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 5,323 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 62,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.