బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:46 IST)

కరోనా 2.0.. యూకే నుంచి వచ్చే వారికి పరీక్షలు తప్పనిసరి.. హై అలెర్ట్

కరోనా 2.0, కరోనా కొత్త స్ట్రెయిన్‌తో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే హై అలెర్ట్ ప్రకటించాయి. అప్రమత్త చర్యల్లో భాగంగా విమాన సర్వీసులను రద్దు చేస్తూ.. సరిహద్దులను మూసివేస్తున్నాయి. యూకే నుంచి వచ్చేవారికి పరీక్షను తప్పనిసరి చేస్తున్నాయి. మన దేశంలో మహారాష్ట్ర మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధించగా..కర్ణాటక గత 15 రోజులుగా విదేశాల నుంచి వచ్చినవారి వివరాలు సేకరిస్తోంది.
 
ఇకపోతే.. కరోనా కొత్త స్ట్రెయిన్‌ దెబ్బకు యూకేలో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన భారత సర్కారు మంగళవారం అర్ధరాత్రి నుంచి 31వ తేదీ దాకా అక్కణ్నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. అయితే, అర్ధరాత్రి దాకా యూకే నుంచి నేరుగా, లింక్‌ విమానాల ద్వారా, యూరప్‌ దేశాల నుంచి వందలాది మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. 
 
ఆ దేశాల నుంచి వచ్చేవారందరికీ విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించి.. పాజిటివ్‌ వస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలని, నెగెటివ్‌ వచ్చినవారిని కూడా వారం-పది రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాలని సోమవారం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. యూకేతోపాటు.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ.. ఆ దేశాల్లో వారు బయల్దేరే ముందు చేయించుకున్న టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికి ఇక్కడికి వచ్చాక తప్పనిసరిగా టెస్టులు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 
 
మరోవైపు కొత్త స్ట్రెయిన్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అంతర్జాతీయ విమానాలు వచ్చే అన్ని ఎయిర్‌పోర్టుల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్‌ వచ్చినవారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు పంపాలని.. నెగెటివ్‌ వచ్చిన వారిని ఇంటివద్దే ఉంచి, వైద్య సిబ్బందితో పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.