బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (11:11 IST)

దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

covid 19 vaccine
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కేసులు భారీగా పెరిగి.. 17 వేలకు పైగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు నాలుగు శాతం దాటి, ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఫిబ్రవరి నెల నాటి ఉద్ధృతి కనిపిస్తోంది. 
 
శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గురువారం 4 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 17,336 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు 4 వేల మేర పెరిగి, 30 శాతం అధికంగా నమోదయ్యాయి. 
 
ఒక్క మహారాష్ట్ర, కేరళలోనే 9 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. దిల్లీలో ముందురోజు కంటే రెట్టింపు కేసులు రాగా, ముంబయిలో 50 శాతం అధికంగా నమోదయ్యాయి. 2020 ప్రారంభం నుంచి 4.33 కోట్ల మంది మహమ్మారి బారినపడ్డారు. అందులో 4.27 కోట్ల మందికి పైగా కోలుకున్నారు.