బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (12:01 IST)

'ఒక్క విహారి అందరి లెక్క సరిచేశాడు' : సెహ్వాగ్

సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ టెస్టులో జట్టును రక్షించేందుకు చివరి రోజున హనుమ విహారి చూపించిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. కండరాలు పట్టేసినా నొప్పిని భరిస్తూ అతను 161 బంతులు ఆడాడు. దీనిపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. 
 
అయితే కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో మాత్రం ఒక వ్యతిరేక కామెంట్‌తో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. '7 పరుగులు చేసేందుకు 109 బంతులా.. ఇంత ఘోర ప్రదర్శనతో క్రికెట్‌ను చంపేసి భారత జట్టు చారిత్రక విజయం సాధించే అవకాశాన్ని హనుమ బిహారి పొగొట్టాడు. ఇది పెద్ద నేరం' అంటూ ట్వీట్ చేశాడు. 
 
అయితే ఈ ట్వీట్‌పై అభిమానులు ఘాటుగా స్పందించారు. కేంద్రమంత్రికి గట్టిగానే బదులిచ్చారు. సుప్రియో అజ్ఞానాన్ని అంత తిట్టిపోశారు. కానీ విహారి కేంద్ర మంత్రికి ఒకే ఒక పదంతో సమాధానం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తన పేరును తప్పుగా రాయడాన్ని చూపిస్తూ 'నా పేరు బిహారి కాదు.. విహారి' అంటూ హనుమ విహారి ట్వీట్ చేశాడు. ఇది నెట్టింట వైరల్ అయింది. 
 
ఇక విహారి సమాధానంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 'ఒక్క విహారి అందరి లెక్క సరిచేశాడుగా' అని హిందీలో ట్వీట్ చేశాడు. భారత స్పిన్నర్ అశ్విన్ అయితే ROFLMAXX అంటూ పడిపడి దొర్లి నవ్వుతున్నట్లు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.