1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (12:26 IST)

క్రిస్ గేల్ విశ్వరూపం.. వరల్డ్‌ కప్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ!

వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. జింబాబ్వే బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. ఫలితంగా వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 138 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో క్రిస్ గేల్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. 
 
నిన్నామొన్నటి వరకు చెత్త ఫామ్‌తో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు పెను సమస్యగా మారిన గేల్.. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో తిరిగి ఫామ్‌లోకి రావడం వెస్టిండీస్ జట్టుకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టయింది. బుధవారం ఉదయం జింబాబ్వేతో మొదలైన మ్యాచ్‌లో జూలు విదిల్చిన గేల్, డబుల్ శతకంతో రెచ్చిపోయాడు. 
 
తొలుత 105 బంతుల్లో సెంచరీని పూర్తి చేసిన గేల్, ఆ తర్వాత మరింతగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి వంద పరుగుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్‌లు ఇమిడివుండగా, ఆ తర్వాత ఏకంగా 11 సిక్స్‌లు, మరో నాలుగు ఫోర్లు బాది.. తొలి డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తన 200 స్కోరులో రెండో వంద పరుగులను కేవలం 33 బంతుల్లో సాధించడం గమనార్హం. ఇందులో 11 సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి.