శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (11:37 IST)

ఇంగ్లీష్ జట్టుతో పాక్ క్రికెట్ సిరీస్.. అక్కడ మ్యాచ్‌లు ప్రసారం కావట!

ఇంగ్లండ్ జట్టుతో పాకిస్థాన్ జట్టు క్రికెట్ సిరీస్ ఆడనుంది. ఇంగ్లీష్ జట్టుతో పాక్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీమ్ ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు ముందే ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ముగియనుంది. జులై 8, 10, 13 వన్డే మ్యాచ్‌లు, జులై 16, 18, 20న టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. యూఏఈలో పీఎస్ఎల్ 6 ముగియగానే పాకిస్తాన్ క్రికెటర్లు అందరూ ఇంగ్లాండ్ బయలుదేరుతారు. 
 
బాబర్ అజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ఆడుతున్న ఈ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో ప్రసారం చేయబోమని ఆ దేశ సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లడించారు. మరో నెల రోజుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రారంభం కానుండగా పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. అసలు ఎందుకు పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్ ప్రసారాలు నిలిపివేస్తున్నామో కూడా ఫవాద్ చౌదరి స్పష్టం చేశారు. 
 
దక్షిణాసియాలో క్రికెట్ ప్రసార హక్కులను భారత కంపెనీలైన స్టార్ ఇండియా, ఆసియా చానల్స్ ప్రసారం చేస్తున్నాయని.. ఇండియన్ కంపెనీలతో వ్యాపారం చేయడం తమకు ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. భారత కంపెనీలతో ఎలాంటి వ్యాపార వ్యవహారాలను తమ దేశంలో ఆమోదించబోవడం లేదని ఆయన అన్నారు.
 
'2019 అగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఆ నిర్ణయానికి నిరసనగానే తాము భారత కంపెనీలతో వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకున్నాము. భారత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే భారత కంపెనీలను పాకిస్తాన్‌లో వ్యాపారం చేయడానికి అనుమతి ఇస్తాము. ప్రస్తుతం మేము తీసుకున్న చర్య వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నష్టం వాటిల్లుతుందని మాకు తెలుసు. అయినా మా నిర్ణయంలో మార్పు లేదు' అని ఫవాద్ చౌదరి స్పష్టం చేశారు.