శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన భారత క్రికెటర్లు... చర్యలు తప్పవా?

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులోని ఐదుగురు క్రికెటర్లు కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేశారు. ఈ చర్యపై క్రికెట్ ఆస్ట్రేలియా మండిపడింది. కోవిడ్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపిచింది. అయితే, భారత క్రికెటర్లు కోవిడ్ రూల్స్ ఎలా బ్రేక్ చేశారో తెలుసుకుందాం. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు త్వరలో జరగనున్న మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ షైనీలు లంచ్ కోసం మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. 
 
అక్కడ భారత్‌కు చెందిన నవల్దీప్ సింగ్ టేబుల్ ముందు వారు కూర్చుని భోజనం చేశారు. అభిమాన క్రికెటర్లు తన ముందు కూర్చోవడంతో నమ్మకలేకపోయిన నవల్దీప్ సింగ్ వారికి తెలియకుండానే వారికి బిల్లు చెల్లించేశాడు. 
 
ఈ విషయం తెలియని క్రికెటర్లు బిల్ చెల్లించేందుకు వెళ్లగా నవల్దీప్ సింగ్ వారి బిల్లును చెల్లించినట్టు తెలిసింది. దీంతో వారు ఆశ్చర్యపోయారు. బిల్లును తాము చెల్లిస్తామని, కట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవాలని నవల్దీప్‌ను కోరినప్పటికీ ఆయన ససేమిరా అన్నాడు. దానిని బహుమతిగా భావించాలని కోరాడు. 
 
ఆ తర్వాత నవల్దీప్ మాట్లాడుతూ పంత్ తనను ఆలింగనం చేసుకున్నాడని, ఆ తర్వాత అందరం కలిసి ఫొటో తీసుకున్నామని చెప్పాడు. ఈ వార్త బయటకు రాగానే క్రికెట్ ఆస్ట్రేలియా అప్రమత్తమైంది. కొవిడ్ నేపథ్యంలో బయటకు వెళ్లడమేకాకుండా, హగ్ చేసుకోవడంతో ఐదుగురినీ ఐసోలేషన్‌లోకి పంపింది. 
 
భారత క్రికెటర్లు బయోబబుల్‌ నిబంధనను ఉల్లంఘించారంటూ వార్తలు రావడంతో నవల్దీప్ వివరణ ఇచ్చుకున్నాడు. పంత్ తనను హగ్ చేసుకోలేదని, వారిని చూసిన ఉత్సాహంలో ఆనందం పట్టలేక అలా చెప్పాను తప్పితే అందులో నిజం లేదని పేర్కొన్నాడు. తాము సామాజిక దూరం పాటించామని స్పష్టం చేశాడు.