ఆదివారం, 23 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2025 (15:21 IST)

గౌహతి టెస్ట్ మ్యాచ్ : భారీ స్కోరు దిశగా సఫారీలు

ahmadabad cricket statidum
గౌహతి వేదికగా ఆతిథ్య భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఫలితంగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సఫారీలు దూసుకెళుతున్నారు. ఈ టెస్టులో రెండు రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. 247/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు స్కోర్‌ 400 పరుగులు దాటింది. సెంచరీతో ముత్తుసామి సత్తా చాటాడు. 
 
203 బంతులు ఎదుర్కొన్న ముత్తుసామి 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 107 పరుగులు చేశాడు. అలాగే, అర్థ శతకంతో మార్కో యాన్సెన్‌ (51; 57 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) క్రీజులో కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 99 బంతుల్లో 94 పరుగులను జత చేశారు. కైల్‌ వెరీన్‌ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన యాన్సెన్‌ దూకుడుగా ఆడాడు. అడపాదడపా ఫోర్లు, సిక్స్‌లు బాదాడు.
 
అంతకుముందు ముత్తుసామి, కైల్‌ వేరీన్‌ ఏడో వికెట్‌కు 236 బంతుల్లో 88 పరుగులు జత చేశారు. వీరి భాగస్వామ్యాన్ని రవీంద్ర జడేజా విడదీశాడు. అతడు సంధించిన అద్భుతమైన బంతిని ఆడే క్రమంలో కైల్‌ వెరీన్‌ (45) క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. రిషభ్‌పంత్‌ తనకు దూరంగా వెళుతున్న బాల్‌ను రెప్పపాటులో అందుకుని వేగంగా స్టంపౌట్‌ చేశాడు. 
 
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (49), కెప్టెన్‌ టెంబా బవుమా (41), కైల్‌ వెరీన్‌ (45) రాణించారు. ఐడెన్‌ మార్‌క్రమ్‌ (38), ర్యాన్‌ రికెల్టన్‌ (35), టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించారు. వియాన్‌ ముల్డర్‌ (13) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 3, రవీంద్ర జడేజా 2, బుమ్రా, సిరాజ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.