మొహాలీ టెస్టులో భారత్‌దే పైచేయి.. కోహ్లీ రికార్డ్ కంచికేనా.. జడేజా అదుర్స్
మొహాలీ టెస్టులో రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌ను 574-8 స్కోరు వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. ఆపై టీమిండియా శ్రీలంక టాపార్డర్‌ను దెబ్బతీసింది. ఆట చివరికి శ్రీలంక జట్టు 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. పత్తుమ్ నిస్సాంక 26, చరిత్ అసలంక 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా 1, జడేజా ఒక వికెట్ తీశారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు శ్రీలంక ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది.
లంక బ్యాటింగ్ తీరు చూస్తుంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కనిపించడంలేదనిపిస్తోంది. అదే జరిగితే, కోహ్లీ తన 100వ టెస్టులో సెంచరీ ఆశలు వదులుకోవాల్సిందే. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 45 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
అయితే మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం శనివారం రవీంద్ర జడేజా చేత రికార్డుల పంట పండించింది. మొదటి ఇన్నింగ్స్ లో 175 పరుగులు సాధించిన జడేజా జట్టుకు అజేయంగా నిలిచాడు. అతడి టెస్ట్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు.
1986లో కాన్పూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కపిల్ దేవ్ 7వ స్థానంలో వచ్చి 163 పరుగులు సాధించిన రికార్డును.. జడేజా అధిగమించాడు. శ్రీలంక జట్టుపై టెస్ట్ మ్యాచ్ లో ఏడో స్థానంలో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ భారత జట్టు తరఫున 150 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.