గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (19:27 IST)

ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు.. కోహ్లీ, డివిలియర్స్‌ నెం.1 జోడీగా..? (video)

AB de Villiers_Virat Kohli
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ల జోడీ అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆల్‌టైమ్ నంబర్‌ వన్‌ జోడీగా నిలిచారు. గతరాత్రి షార్జా వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, ఎబి డివిలియర్స్‌లు కొత్త మైలురాయి దాటారు. వీరిద్దరూ జోడీ ఐపీఎల్ చరిత్రలో 10 సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్న మొదటి జోడీగా నిలిచారు.
 
షార్జా వేదికగా జరిగిన కోల్‌కతాతో తలపడిన సందర్భంగా కోహ్లీసేన 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 33 బంతుల్లో 73 పరుగులు (5x4, 6x6), విరాట్‌ కోహ్లీ 28 బంతుల్లో ఒక ఫోర్‌తో 33 పరుగులు తో చెలరేగారు. వీరిద్దరూ కేవలం 46 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. దీంతో ఈ టోర్నీలో 10 సెంచరీల భాగస్వామ్యాన్ని నిర్మించిన ఆటగాళ్లుగా రికార్డులకెక్కారు. అలాగే వీరిద్దరూ కలిసి 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.
 
విరాట్ కోహ్లీ-క్రిస్ గేల్ కాంబినేషన్ 9 శతకాలు సాధించి రెండో స్థానంలో ఉంది. దీని తరువాత 6 శతాబ్దాల భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. జానీ బెయిర్‌స్టో-డేవిడ్ వార్నర్‌లకు ఐదు సెంచరీ పార్టనర్ షిప్ ఉంది. గౌతమ్ గంభీర్- రాబిన్ ఉతప్ప కూడా 5 సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.
 
మరోవైపు డివిలియర్స్‌ ఈ టోర్నీలో ఆరుసార్లు.. 23 లేదా అంతకన్నా తక్కువ బంతుల్లో అర్ధశతకాలు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ముంబయి ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఏబీడీ దంచి కొట్టడంతో పొలార్డ్‌తో సమానంగా నిలిచాడు.