సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2024 (09:16 IST)

ఐపీఎల్‌లో మాయంకానున్న విరాట్ కోహ్లీ రికార్డు.. ఏంటది?

Jos Buttler
ఐపీఎల్‌లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డు మాయంకానుంది. ఈ రికార్డుకు ఇంగ్లండ్ క్రికెటర్ జాస్ బట్లర్ అడుగుదూరంలో ఉన్నాడు. ఇప్పటికే క్రిస్ గేల్ రికార్డును అధికమించిన బట్లర్.. కోహ్లీ రికార్డుకు మరో అడుగు దూరంలో నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ జట్టు కోల్‌కతాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ బాదేశాడు. మొత్తం 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 107 పరుగులు చేశాడు. తొలుత 33 బంతుల్లో 42 పరుగులు రాబట్టిన బట్లర్ ఆ తర్వాత మైదానంలో విధ్వంసం సృష్టించాడు. 22 బంతుల్లో ఏకంగా 62 పరుగులు పిండుకున్నాడు. 
 
దీంతో ఐపీఎల్‌లో బట్లర్ చేసిన సెంచరీల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో క్రికెట్ లెజండ్ క్రిస్ గేల్ పేరిట ఇప్పటివరకు ఉన్న రికార్డు మాయమైపోయింది. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల జాబితాలో బట్లర్ రెండో స్థానానికి చేరింది. బట్లర్ చేసిన సెంచరీల సంఖ్య ఏడుకు చేరుకోగా, ఆరు సెంచరీలతో గేల్ మూడో స్థానానికి దిగజారాడు. కోహ్లీ కంటే బట్లర్ ఒక్క అడుగు వెనుక ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు మొత్తం ఎనిమిది సెంచరీలు చేశాడు. దీంతో బట్లర్ మరో సెంచరీ సాధిస్తే కోహ్లీతో సమానంగా నిలువనున్నాడు. 
 
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల వీరులు... 
విరాట్ కోహ్లీ 244 మ్యాచ్‌లలో 8 సెంచరీలు చేయగా, జాస్ బట్లర్ 102 మ్యాచ్‌లలో ఏడు  సెంచరీలు, క్రిస్ గేల్ 142 మ్యాచ్‌లలో 6 సెంచరీలు, కేఎల్ రాహుల్ 124 మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు, డేవిడ్ వార్నర్ 182 మ్యాచ్‌‍లలో 4, షేన్ వాట్సన్ 145 మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు చొప్పున చేశారు. అలాగే, టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నారు. క్రిస్ గేల్ 22, బాబర్ అజం 11, విరాట్ కోహ్లీ 9, డేవిడ్ వార్నర్, మైఖేల్ క్లింగర్, ఆరోన్ ఫించ్, రోహిత్ శర్మ, జాస్ బట్లర్‌లు ఎనిమిదేసి సెంచరీలు చేశారు.