ఆదివారం, 7 డిశెంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 డిశెంబరు 2025 (19:34 IST)

వైజాగ్ వన్డే మ్యాచ్ : భారత్ టార్గెట్ 271 రన్స్

india vs south africa
వైజాగ్ వేదికగా పర్యాటక సౌతాఫ్రికా, ఆతిథ్య భారత్‌లో మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. విశాఖపట్టణం వేదికగా శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ముంగిట సఫారీలు 271 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచిన భారత్... సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
ఇందులో సఫారీ ఓపెనర్ క్వింటన్ డికాక్ 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో చెలరేగి పోయి 106 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 29, మాథ్యూ బ్రిట్జ్కే 24, కేశవ్ మహరాజ్ 20 (నాటౌట్), మార్కో యాన్సెన్ 17 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
 
కాగా మ్యాచ్ ప్రారంభంలోనే సఫారీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే రికెల్‌టన్ (0)ని అర్ష్‌దీప్ సింగ్ వెనక్కి పంపాడు. కానీ, డికాక్, బావుమా నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. ప్రసిద్ధ్‌ వేసిన 11 ఓవర్‌లో డికాక్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. జడేజా బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టి డికాక్ హాఫ్‌ సెంచరీ (42 బంతుల్లో) మార్క్ అందుకున్నాడు. కాసేపటికే బావుమాని జడ్డూ ఔట్ చేశాడు. దీంతో 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 
 
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన బ్రిట్జ్కే.. తిలక్ వర్మ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే, బ్రిట్జ్కే, మార్‌క్రమ్‌ (1)ని ప్రసిద్ధ్‌ కృష్ణ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపి సఫారీలకు షాకిచ్చాడు. హర్షిత్ వేసిన 30 ఓవర్‌లో సిక్స్ కొట్టి డికాక్ 80 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత డికాక్‌ని ప్రసిద్ధ్‌ క్లీన్‌బౌల్డ్ చేయడంతో 33 ఓవర్లకు సౌతాఫ్రికా 199/5తో నిలిచింది. 
 
తర్వాత కుల్‌దీప్ జోరు మొదలైంది. ఒకే ఓవర్‌లో బ్రెవిస్, యాన్సెన్‌ను వెనక్కి పంపాడు. బ్రెవిస్‌.. రోహిత్‌కు చిక్కగా.. యాన్సెన్ జడేజాకు క్యా్చ్ ఇచ్చాడు. కోర్బిన్ బాష్‌ (9) కుల్‌దీప్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఎంగిడి (1) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బార్ట్‌మన్ (3)ని ప్రసిద్ధ్‌ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా ఆలౌటైంది.