1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (10:39 IST)

పాకిస్థాన్ క్రికెటర్లకు వసీం అక్రమ్ ధైర్యవచనాలు!

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఓటమి... ఆ తర్వాతి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో దారుణ పరాభవంతో కుంగిపోయిన పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ళకు ఆ దేశ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ ధైర్యవచనాలు చెప్పేందుకు ముందుకు వచ్చారు. 
 
వరుస పరాజయాల నేపథ్యంలో, పాక్ జట్టుపై స్వదేశంలో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. అభిమానులు తమ ఇళ్లలోని టీవీలను సైతం పగులగొడుతున్నారు. జట్టు ప్రదర్శనకు వ్యతిరేకంగా లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది కూడా. దీంతో, తర్వాతి మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలంటూ టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచింది. 
 
దీంతో వసీం అక్రమ్ కల్పించుకున్నారు. ఆటగాళ్ళను తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడం భావ్యంకాదంటూ బాసటగా నిలిచారు. గంటలకొద్దీ ఆటగాళ్లకు హితబోధ చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించలేరని, సుదీర్ఘ సమయం పాటు సమావేశాలు నిర్వహించి ఆటగాళ్లను విసిగించవద్దని హితవు పలికాడు. 
 
పాక్ క్రికెట్ పెద్దలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్నాడు. ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచడం ద్వారా, వాళ్లు తర్వాతి మ్యాచ్‌కు తాజాగా బరిలో దిగేందుకు సహకరించాలని సలహా ఇచ్చాడు. ఈ విషయంలో అవసరమైతే తాను ధైర్యవచనాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు అక్రమ్ ప్రకటించారు.