శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (19:54 IST)

క్రికెట్ గురించి నాకు కథలు చెప్పొద్దు ప్లీజ్... ఇమ్రాన్ ఖాన్

తాను నాలుగు దశాబ్దాల పాటు క్రికెట్ ఆడానని, క్రికెట్ గురించి తనకు కథలు చెప్పొద్దు అని పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆ దేశ మాజీ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో క్రికెట్ దుస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పరిస్థితికి అధికారులు కారణాలు వివరించబోగా.. తాను 40 ఏళ్లు క్రికెట్ ఆడానని, తనకు కథలు చెప్పొద్దంటూ సీరియస్ అయ్యారు. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికస్థితితో పాటు ఆ దేశ క్రికెట్ జట్టు పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైంది. ఒక్క టీ20ల్లో మినహా మిగతా ఫార్మాట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చివరి స్థానం కోసం పోటీ పడుతున్నది. ఈ నేపథ్యంలో క్రికెట్ టీమ్‌ను మళ్లీ గాడిలో పడేసే పనిని ఆయన మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ కావడంతో కాస్త సీరియస్‌గానే క్రికెట్ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు.
 
దీంతో అసలు క్రికెట్ గురించి తనకు వివరించాల్సిన అవసరమే లేదని ఆయన చెప్పారు. పాక్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలని, ఆస్ట్రేలియా టీమ్ తరహాలో పాక్‌లోనూ మార్పులు చేయాలని ఇమ్రాన్ స్పష్టం చేశారు. 2017లో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం తప్ప ఈ మధ్యకాలంలో ఆ టీమ్ పెద్దగా సాధించిందేమీ లేదు. పైగా ఆ టీమ్‌తో క్రికెట్ ఆడకూడదని ఇండియా నిర్ణయించడంతో ఆర్థికంగా కూడా పీసీబీ తీవ్ర నష్టాల పాలైంది. ఈ నేపథ్యంలో దేశంలో క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావడంపై ఇమ్రాన్‌ఖాన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. 
 
కాగా, పాకిస్థాన్ గెలిచిన ఏకైక వరల్డ్‌కప్ ఇమ్రాన్‌ ఖాన్ సారథ్యంలోనే కావడం విశేషం. 1992లో కెప్టెన్‌గా పాక్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. పాక్ తరఫున 88 టెస్టులు, 175 వన్డేలు ఆడిన అనుభవం ఇమ్రాన్ సొంతం. దీంతో ఆ అనుభవాన్నంతా రంగరించి.. క్రికెట్ టీమ్‌ను మళ్లీ గాడిలో పడేయడానికి విలువైన సూచనలు చేశాడు.