జట్టుకు విజయాన్ని అందిచలేనపుడు కోచ్ పదవి ఎందుకు? ఫిల్ సిమన్స్
ఒక కోచ్‌గా జట్టుకు విజయాలను అందించలేనపుడు కోచ్ పదవిలో కొనసాగడం అర్థం లేదని వెస్టిండీస్ జట్టు ప్రధాన కోచ్ ఫిల్ సిమన్స్ అభిప్రాయపడ్డారు. అందుకే తన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులో వెస్టిండీస్ జట్టు గ్రూపు దశను కూడా దాటలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేవలం ఒక గెలుపు, రెండు పరాజయాలతో గ్రూపు-బిలో ఆఖరు స్థానానికి పరిమితమై ఇంటికి బాటపట్టింది.
ఈ క్రమంలో ఆ జట్టు కోచ్‌గా ఉన్న ఫిల్ సిమన్స్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. "ఇది నిరుత్సాహకరం. బాధకు గురిచేస్తుంది. మేము తగినంతగా రాణించలేకపోయాం. ఇపుడు మన ప్రాతినిథ్యం లేకుండా టోర్నమెంట్‌ను చూడాలి. ఇది గంభీరం. అందుకు అభిమానులు, అనుచరులు అందరినీ నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇదేమీ తాజా ఓటమికి ప్రతి స్పందన చర్య కాదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కోచ్ పదవి నుంచి దిగిపోయే సమయం ఇపుడు వచ్చేసింది" అని ప్రకటించారు.
అంటే ఆయన కోచ్‌గా నవంబరు 30 నుంచి డిసెంబరు 12వ తేదీ వరకు ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ వరకే ఫిల్ సిమన్స్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ఈ పదవి నుంచి ఆయన తప్పుకుంటారు.