మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (10:31 IST)

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎవరన్న అంశంపై ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చిన సస్పెన్స్‌కు తెరపడింది. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని రూపొందించుకున్న రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ బౌలర్ పరాస్ మాంబ్రే నియమితులు కానున్నారు. 
 
ప్రస్తుతం భారత జట్టు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు, టీ20 వరల్డ్‌కప్‌తో ముగియనుంది. దీంతో టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస నుంచి హెడ‌కోచ్‌గా బాధ్యతలు తీసుకునే రాహుల్ ద్రావిడ్, 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్, ఆ పదవికి రాజీనామా సమర్పించబోతున్నారు. 
 
అలాగే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవీ కాలం కూడా ముగియనుండడంతో అతని స్థానంలో భారత మాజీ బౌలర్ పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్‌సీఏలో రాహుల్ ద్రావిడ్‌తో పాటు పరాస్ మాంబ్రే బౌలింగ్ శిక్షకుడిగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరూ త్వరలోనే ఎన్‌సీఏలో తమ పొజిషన్లకు రాజీనామా సమర్పించనున్నారని బీసీసీఐ అధికారిక ప్రకటన ద్వారా తెలియచేసింది.