పూణెలో రాహుల్ - పంత్ విధ్వంసం : ఇంగ్లండ్ టార్గెట్ 337 రన్స్ టార్గెట్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, శుక్రవారం పూణె వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 25, ధావన్ 4 పరుగులు చేశారు.
ఇటీవల టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమై ఓపెనర్ స్థానం నుంచి మిడిలార్డర్‌కు మారిన కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆటతీరు చూపిస్తూ సెంచరీ సాధించగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మరోసారి ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. దాంతో భారత్ భారీ స్కోరు చేసింది.
కేఎల్ రాహుల్ 114 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 108 పరుగులు చేయగా, పంత్ కేవలం 40 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు. అంతకుముందు కెప్టెన్ కోహ్లీ 66 పరుగులు చేయగా, చివర్లో హార్దిక్ పాండ్య కూడా 4 సిక్సులు, ఒక ఫోర్ బాది 35 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే, టామ్ కరన్ రెండేసి వికెట్లు తీయగా, శామ్ కరన్, అదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.