బుధవారం, 5 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 నవంబరు 2025 (11:51 IST)

తెలుగు తేజం శ్రీ చరణిపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు

Ashwin
Ashwin
తెలుగు తేజం, కడపబిడ్డ, నల్లపురెడ్డి శ్రీచరణిపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతోనే టీమిండియా విజేతగా నిలిచిందని కొనియాడాడు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. 
 
9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీసింది. ఫైనల్‌తో సహా సెమీఫైనల్లో శ్రీ చరణి కట్టడిగా బౌలింగ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచకప్ ఆడిన తొలి క్రికెటర్ గుర్తింపు పొందిన శ్రీచరణి.. పటిష్టమైన ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. 
 
ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై ఆమె 5 వికెట్లు పడగొట్టింది. సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ.. భారత జట్టులో శ్రీ చరణి ప్రమాదకరమైన బౌలర్ అని పేర్కొంది. 
 
తాజాగా ఈ విజయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. శ్రీ చరణిని ప్రత్యేకంగా కొనియాడాడు. భవిష్యత్తులో ఆమె సూపర్ స్టార్ అవుతుందని జోస్యం చెప్పాడు. ఆమె బౌలింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. 
 
మహిళల క్రికెట్‌లో గొప్ప స్పిన్నర్లు అయిన సోఫీ ఎక్లెస్టోన్, జెస్ జోనాసెల‌తో శ్రీచరణిని పోల్చాడు. 'శ్రీ చరణి బంతి తిప్పే విధానం, వేగం అద్భుతమని కొనియాడాడు. 
 
భారత్ సాధించిన అన్ని ప్రపంచకప్‌ల కంటే ఈ విజయం ఎంతో గొప్పదని కొనియాడాడు. ముఖ్యంగా ప్రపంచకప్ టైటిల్‌ను మాజీ క్రికెటర్లు అయిన మిథాలీ రాజ్, జులాన్ గోస్వామికి అందించడాన్ని అశ్విన్ ప్రత్యేకంగా అభినందించాడు.