బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (15:41 IST)

ఏ విషయాన్ని క్లిష్టతరం చేయకుండా సింపుల్‌గా ఉంచుతా: రోహిత్ శర్మ

rohith sharma
ఒక జట్టు కెప్టెన్‌గా ఏ ఒక్క విషయాన్ని క్లిష్టతరం చేయకుండా సింపుల్‌గా ఉండేలా చేసేందుకు ప్రయత్నిస్తానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. త్వరలోనే ఆసియా క్రికెట్ కప్, టీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో జట్టు సభ్యులు ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. 
 
తాజాగా ఆయన ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సారథిగా జట్టులో తాను అన్ని విషయాలను సింపుల్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తానని, ఏ విషయంలో అయినా సరే ఆటగాళ్ల మధ్య గందరగోళం లేకుండా చూడటంతో పాటు, జట్టులో వారి పాత్రలపై స్పష్టత ఉండాలని కోరుకుంటానని చెప్పాడు. 
 
"ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా కొన్ని సంవత్సరాలుగా నేను ఏం చేస్తున్నానో.. భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఈ సమయంలో అలానే చేస్తున్నా. ఏ విషయాన్నీ క్లిష్టతరం చేయకుండా సింపుల్‌గా ఉంచడం నాకు ఇష్టం. జట్టులో ప్రతీ ఆటగాడికి స్వేచ్ఛనిస్తా. అదేసమయంలో జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి అర్థమయ్యేలా చేస్తా. 
 
నేను నా నుంచి ఏం ఆశిస్తున్నానో.. జట్టు నుంచి కూడా అదే కోరుకుంటా. కాబట్టి ఆటగాళ్లలో గందరగోళం లేకుండా చూసుకోవాలనుకుంటున్నా. అత్యున్నత స్థాయిలో ఆడుతున్నప్పుడు ఎలాంటి అస్పష్టత ఉండకూడదు. రాహుల్ భాయ్ (కోచ్ ద్రవిడ్)తో కలిసి జట్టులో అంతా సవ్యంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. మేం దానిపై ఫోకస్ పెడతాం. అన్నీ సింపుల్‌గా ఉండాలనుకుంటా కాబట్టి నా వరకైతే ఇది చాలా సులువైన విషయం" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.