1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 మార్చి 2016 (22:41 IST)

ట్వంటీ20 వరల్డ్ కప్ : జేసన్ రాయ్ వీరవిహారం... కివీస్ చిత్తు.. ఫైనల్లో ఇంగ్లండ్

టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్‌ జైత్రయాత్రకి సెమీ ఫైనల్లో ఇంగ్లీష్ క్రికెటర్లు బ్రేక్ వేశారు. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 154 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ జట్టు.. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (78: 44 బంతుల్లో 11×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో 17.1 ఓవర్లలోనే 159/3తో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఫైనల్లో అడుగు పెట్టింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ జట్టులో మన్రో (46), విలియమ్సన్‌ (32) రాణించినా.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు నిరాశపరచడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులే చేయగలిగింది. తర్వాత వచ్చిన మన్రో (46: 32 బంతుల్లో 7×4, 1×6) వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఐదో ఓవర్‌ వేసిన ఫ్లంకెట్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన మన్రో కెప్టెన్‌ విలియమ్సన్‌తో కలిసి రెండో వికెట్‌కి 74 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు.
 
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని స్పిన్నర్‌ మొయిన్‌ అలీ విడదీశాడు. బంతిని అంచనా వేయడంతో తడబడిన విలియమ్సన్‌ బౌలర్‌ అలీకే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మన్రో కూడా ఫ్లంకెట్‌ బౌలింగ్‌లో జట్టు స్కోరు 107 వద్ద మూడో వికెట్‌ రూపంలో ఔటవడంతో న్యూజిలాండ్‌ స్కోరు బోర్డు నెమ్మదించింది. 
 
మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అండర్సన్‌ (28: 23 బంతుల్లో 2×4, 1×6) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే, టేలర్‌ (6), రోంచి (3), శాంట్నర్‌ (7) కీలక సమయంలో పెవిలియన్‌ చేరడంతో న్యూజిలాండ్‌ 153 పరుగులే చేయగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ (3/26) కివీస్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
 
ఆ తర్వాత 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ క్రికెటర్లు.. 17.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్నారు. అయితే, ఇంగ్లండ్ లక్ష్య ఛేదనను మెరుపు వేగంతో ఆరంభించింది. తొలి ఓవర్‌ వేసిన న్యూజిలాండ్‌ పేసర్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో జేసన్‌ రాయ్‌ (78: 44 బంతుల్లో 11×4, 2×6) నాలుగు ఫోర్లు బాదేశాడు. మరో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ (20: 19 బంతుల్లో 1×4, 1×6) ఆచితూచి ఆడుతున్నా ఎక్కడా జోరు తగ్గించని జేసన్‌ రాయ్‌ కివీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ వరుస బౌండరీలు బాదేశాడు. 
 
దీంతో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అయితే జట్టు విజయానికి 44 బంతుల్లో 47 పరుగులు అవసరమైన దశలో రాయ్‌ రెండో వికెట్‌ రూపంలో ఔటైనా రూట్‌ (27 నాటౌట్‌: 22 బంతుల్లో 3×4), బట్లర్‌ (32 నాటౌట్‌: 17 బంతుల్లో 2×4, 3×6) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇంగ్లండ్ జట్టు గురువారం రాత్రి వెస్టిండీస్ - భారత్‌ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో ఫైనల్‌లో తలపడుతుంది.