శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (13:46 IST)

నేడు ఆప్ఘన్ వర్సెస్ కివీస్ : మ్యాచ్‌ ఫలితంపై భారత్‌ ఆశలు

దుయాబ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లోభాగంగా, ఆదివారం ఆప్ఘనిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితం కోసం భారత క్రికెట్ జట్టు కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. 
 
సాధారణంగా ఈ మ్యాచ్‌పై ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ, ఇందులో వచ్చే ఫలితం కోసం కోట్లాది భారత అభిమానులు ఆతృతగా ఎదురుచూడబోతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ గెలిస్తేనే భారత జట్టుకు సెమీస్‌ అవకాశం ఉంటుంది. 
 
అప్పుడు అఫ్ఘాన్‌, కివీస్‌, భారత్‌ (నమీబియాతో విజయంతో)కు సమానంగా ఆరు పాయింట్లుంటాయి. కానీ అందరికంటే ఎక్కువ నెట్‌రన్‌రేట్‌ కలిగిన కోహ్లీ సేన సెమీస్‌లో అడుగుపెడుతుంది. అందుకే ఎలాగైనా కివీస్‌పై నబీ సేన గెలిచి మన జట్టుకు దారి చూపాలని కోరుకుంటున్నారు. 
 
కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది. ఇదే జరిగితే భారత్‌ ఆశలు ఆవిరై, నమీబియాతో జరిగే చివరి మ్యాచ్‌ నామమాత్రమవుతుంది.