ధోనీ.. ధోనీ అని అరవకండి.. ఫ్యాన్స్‌కు కోహ్లీ సూచన
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీపింగ్ చేసే సమయంలో.. బంతిని చేజార్చిన సమయంలో ధోనీ.. ధోనీ అంటూ అరవకూడదని ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు సూచించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ వికెట్ కీపర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ప్రపంచ కప్‌కు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు దూరంగా వుంటున్న ధోనీ.. మైదానంలో ఎప్పుడెప్పుడు దిగుతాడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపింగ్ చేసిన రిషబ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
ఇంకా అతను అవుట్ చేసే ఛాన్సులను చేజార్చుకుంటున్నాడని టాక్ వస్తోంది. అంతేగాకుండా రిషబ్ పంత్ క్యాచ్‌లు మిస్ చేసుకుంటున్న సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ ధోనీ... ధోనీ అంటూ కేకలు వేయడంపై కోహ్లీ స్పందించాడు.
రిషబ్ పంత్ బంతిని చేజార్చుకునేటప్పుడు.. క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ ధోనీ.. ధోనీ అంటూ అరవకూడదన్నాడు. ఇది అగౌరవపు చర్య అంటూ వ్యాఖ్యానించాడు. క్రికెటర్లందరూ దేశం కోసమే ఆడుతున్నారు. అందరికీ మద్దతు తెలపాల్సిన బాధ్యత మనపై వుందని చెప్పుకొచ్చాడు.