పింక్ టెస్ట్ : కోహ్లీ సెంచరీ.. భారత్ డిక్లేర్డ్.. కష్టాల్లో బంగ్లాదేశ్

ఠాగూర్| Last Updated: శనివారం, 23 నవంబరు 2019 (19:10 IST)
కోల్‌కతా వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 347 పరుగులు చేయగా, అదే స్కోరు వద్ద డిక్లేర్డ్ చేశాడు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది.

అయితే తన బౌలర్ల ప్రదర్శన పట్ల విశ్వాసం ఉంచిన కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేందుకు వెనుకాడలేదు. షమీ, ఉమేశ్, ఇషాంత్‌లతో కూడిన టీమిండియా పేస్ దళాన్ని ఎదుర్కొని 200 పైచిలుకు పరుగులు చేయడం బంగ్లాకు తలకు మించిన పనే! ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

మరోవైపు, రెండో రోజు ఆట తొలి సెషన్‌లో కోహ్లీ (136) సెంచరీ హైలైట్ అని చెప్పాలి. పింక్ బంతిని ఎదుర్కోవడం తొలిసారే అయినా ఎంతో పట్టుదల కనబర్చిన కోహ్లీ అద్భుతరీతిలో శతకం సాధించాడు. అంతకుముందే రహానే (51), జడేజా (12) కూడా వెనుదిరిగారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ 3, ఇబాదత్ 3, అబు జాయేద్ 2 వికెట్లు సాధించారు.

అంతకుముందు... రెండో రోజు ఆట తొలి సెషన్‌లో కోహ్లీ దూకుడుగా ఆడి రికార్డు సెంచరీ నమోదు చేయగా.. రహానే ఓపికగా ఆడి, అర్థ సెంచరీ సాధించాడు. తొలి సెషన్‌ను భారత్ 4 కోల్పోయి, 289 పరుగులతో ముగించింది.

లంచ్ విరామం అనంతరం రెండో ఓవర్లోనే జడేజా వికెట్ కోల్పోయిన మరికాసేపటికే కెప్టెన్ విరాట్ 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇబాదత్ హుసేన్ బౌలింగ్‌లో ఔటవడంతో, మిగితా బ్యాట్స్‌మెన్ అడపాదడపా బౌండరీలు బాదినప్పటికీ క్రీజులో నిలదొక్కుకోక, పెవిలియన్‌కు క్యూ కట్టారు.దీనిపై మరింత చదవండి :