గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2023 (10:53 IST)

ఉప్పల్ మ్యాచ్‌ రీ షెడ్యూల్.. స్పందించిన బీసీసీఐ

uppal stadium
వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇలా జరిగితే భద్రత కల్పించడం కష్టమని హైదరాబాద్ నగర పోలీసులు అంటున్నారు. అందువల్ల మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు బీసీసీఐకు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
దీనిపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందిస్తూ, 'వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరుగనున్న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అయితే, వరల్డ్ కప్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ను మార్చడం అంత తేలిక కాదు. కేవలం బీసీసీఐ మాత్రమే షెడ్యూల్‌ను మార్చలేదు. మిగతా జట్లు, ఐసీసీ. క్రికెట్‌ సంఘాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది' అని రాజీవ్ శుక్లా తెలిపారు. 
 
పాకిస్థాన్‌ మ్యాచ్‌ కావడంతో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే హైదరాబాద్‌ పోలీస్‌, క్రికెట్‌ సంఘం ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ వేదికగానే పాకిస్థాన్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో, అక్టోబరు 10న శ్రీలంకతో తలపడనుంది. అలాగే రెండు వార్మప్‌ మ్యాచ్‌లను కూడా ఉప్పల్‌లోనే పాక్‌ ఆడనుంది.