రవిశాస్త్రి, కోహ్లీ పెట్టిన యోయో టెస్టే నా కొంపముంచింది.. యువరాజ్ సింగ్
టీమిండియాలో చోటు కోల్పోవడానికి యోయో టెస్టే కారణమని, దాంట్లో పాస్ కాలేకపోవడం వల్లే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశానని స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. అయితే, ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉంటే మాత్రం తన పరిస్థితి వేరేలా ఉండేదని, తన క్రికెట్ కెరీర్‌ను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చేది కాదని యువరాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ హయాంలోనే యోయో టెస్టును ప్రారంభించడాన్ని యువరాజ్ సింగ్ పరోక్షంగా విమర్శించాడు. క్రికెటర్ బాగా ఆడుతుంటే ఆ టెస్టుతో పనేంటని నిలదీశాడు. సౌరవ్ గంగూలీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. ఆటగాళ్ల అవసరాలను అర్థం చేసుకునే విజయవంతమైన సారథి అని కితాబిచ్చాడు. గంగూలీని తాను దూరదృష్టి గలవాడిగా భావిస్తున్నాను.
అతను దేశవాళీ క్రికెట్ స్థితిని కూడా మెరుగుపరచగలడని తాను ఆశిస్తున్నానని యువరాజ్ సింగ్ తెలిపాడు. కాగా, కేన్సర్ ను జయించి క్రికెట్‌లోకి మళ్లీ వచ్చాక యువీ యోయో టెస్ట్ పాస్ కాలేదంటూ జట్టులోకి తీసుకోలేదన్న సంగతి తెలిసిందే.