శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (09:33 IST)

ప్రపంచ కప్ : రోహిత్ సూపర్ సెంచరీ... సఫారీలపై భారత్ స్వారీ

ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. సౌతాంఫ్టన్ వేదికగా బుధవారం సౌతాఫ్రికా జట్టుతో భారత్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ను ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. తొలుత ఫీల్డింగ్‌, బౌలింగ్‌లలో మెరిసిన భారత కుర్రోళ్లు ఆ తర్వాత బ్యాటింగ్‌లో రాణించారు. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించారు. దీంతో వరల్డ్ కప్‌లో భారత్ తన ఆరంభాన్ని అద్భుతంగా ప్రారంభించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. సఫారీలను భారత బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీసుకుని సౌతాఫ్రికా వెన్నువిరిచాడు. అలాగే, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలు రెండేసి వికెట్లతో ఆ తర్వాత పని కానిచ్చి సఫారీలను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో క్రిస్ మోరిస్ చేసిన 42 పరుగులే అత్యధికం.
 
ఆ తర్వాత 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 4 వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ భారత్ తరపున 122 పరుగులు చేశాడు. నిజానికి భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 13 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (8) ఔట్ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (18) నిరాశపరిచాడు. 
 
అయితే, ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయి దక్షిణాఫ్రికా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. కేఎల్ రాహుల్ 26, ధోనీ 34 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 15 పరుగులు చేసి మ్యాచ్‌కు ఘనమైన ముగింపు ఇచ్చాడు. సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించిన రోహిత్ శర్మకు 'ప్లేయర్ ఆఫ్ మ్యాచ్' అవార్డు దక్కింది.