అమ్మానాన్నా సారీ.. హెచ్.ఆర్. మేనేజర్ వేధింపులు భరించలేకపోతున్నా...
ఒక కంపెనీ హెచ్.ఆర్. మేనేజర్ వేధింపులు భరించలేక ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మా.. నాన్నా.. క్షమించండి.. మీతో కలిసి జీవించాలి అనుకున్నాను. కానీ, తప్పడం లేదు. కొంత కాలంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నా. మా కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ అంటూ ఆ యువకుడు ఆత్మహత్య లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధి స్టేషన్ తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కొత్తూరు మున్సిపాలిటీలో వాటర్‌మెన్‌గా పనిచేస్తున్న పాశం గోపాల్, అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్న కుమారుడు సురేష్(29) సమీపంలోని వావిన్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. హెచ్‌ఆర్ మేనేజర్ రవికుమార్ కూన వేధింపులు తాళలేక ఉద్యోగానికి రాజీమా చేశాడు. నోటీస్ పీరియడ్‌లో భాగంగా ఈ నెల 5 వరకు పనిచేశాడు. ఆదివారం ఇంట్లోవారు బంధువుల పెళ్లికి వెళ్లడంతో సురేష్ ఇంట్లో చీరతో ఉరివేసుకున్నాడు.
మధ్యాహ్నం కుటుంబీకులు తిరిగివచ్చేటప్పటికే అతను మృతి చెందాడు. తల్లి అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్ వివరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని.. అన్నావదినలు, చెల్లి, పిల్లల్ని విడిచి వెళుతున్నందుకు బాధగా ఉందంటూ సురేష్ లేఖలో పేర్కొన్నాడు.