1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (09:24 IST)

కామారెడ్డితో అమానుషం.. దళిత మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారంకొట్టి విద్యుత్ స్తంభానికి కట్టేసి....

victim woman
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో ఓ అమానుష ఘటన జరిగింది. దళిత మహిళన వివస్త్రను చేసి, కళ్ళలో కారం కొట్టి, విద్యుత్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. దీన్నంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. జిల్లాలోని రామారెడ్డి మండలంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివవరాలను పరిశీలిస్తే, 
 
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్‌ గ్రామానికి చెందిన సందాని నరేశ్‌ ముదిరాజ్‌ వ్యవసాయ కూలీ.. మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన సంధ్య అనే యువతిని పెళ్లి చేసుకొని ఇల్లరికం వెళ్లాడు. వీరికి ఏడాది వయసు పాప ఉంది. అయితే నరేశ్‌ తన అమ్మమ్మ వాళ్ల ఊరైన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి తరచూ వెళ్లేవాడు. అక్కడ ఓ దళిత యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ దళిత యువతికి భర్త ఉన్నా అతడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో వేరుగా ఉంటోంది. నరేశ్‌కు ఆ దళిత యువతితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఇది నరేశ్‌ భార్య సంధ్యకు తెలియడంతో ఐదు నెలల క్రితం కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. తీరు మార్చుకోవాలని నరేశ్‌ను కుల పెద్దలు హెచ్చరించారు. అయినా నరేశ్‌ పద్దతి మార్చుకోకపోవడంతో సంధ్య తరచూ గొడవపడేది. కొన్నాళ్లకు నరేశ్‌ ఆ దళిత యువతిని ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ రామారెడ్డిలోని ఓ రైస్‌మిల్లులో పని చేసుకుంటూ అదే మండలంలోని ఇసన్నపల్లిలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 
 
ఇది తెలిసి సంధ్య, ఆమె కుటుంబసభ్యులు నెల 4వ తేదీన నరేశ్‌ అద్దెకు ఉండే ఇంటికొచ్చారు. లోపలికి చొరబడి ఇద్దరినీ వివస్త్రలుగా చేసి దాడి చేశారు. ఇద్దరిపై కారం చల్లుతూ పాశవికంగా దాడి చేసి.. దాన్నంతా వీడియో తీశారు. ఆపై సోషల్‌ మీడియాలో పెట్టారు. అదే రోజు అర్థరాత్రి ఇద్దరినీ అక్కాపూర్‌కు తీసుకొచ్చి ఓ విద్యుత్తు స్తంభానికి తాళ్లతో కట్టి బంధించారు. మాచారెడ్డి పోలీసులొచ్చి వారిని విడిపించి గ్రామ పంచాయతీ వద్ద కూర్చోబెట్టి వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
దీనిపై కేసు నమోదు చేయాల్సిందిగా పలువురు కోరగా ఈ ఘటన రామారెడ్డి మండలంలో జరిగిందని అక్కడే పిటిషన్‌ ఇవ్వాలని మాచారెడ్డి పోలీసులు తెలిపినట్లు గ్రామస్థులు తెలిపారు. దీనిపై రామారెడ్డి ఎస్ఐ సుధాకర్‌ని వివరణ కోరగా.. దళిత యువతి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా దళిత యువతిని వివస్త్రను చేసిన ఘటనపై కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ సీరియస్‌ అయ్యారు. ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.