గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:44 IST)

మరికాసేపట్లో కన్యాదానం చేయాలి: ఇంతలో తల్లిదండ్రులు ఆత్మహత్య

క్షణికావేశంలో పెద్దాయన తీసుకున్న నిర్ణయం పెళ్లి మండపంలో విషాదాన్ని నింపింది. మరికొద్దిసేపట్లో కన్యాదానం చేయాల్సిన ఆ దంపతులు కాటికి పయనమయ్యారు. పెళ్లి జరగడానికి మరికొన్ని నిమిషాల ముందే అనూహ్యంగా వధువు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.
 
వివరాలు ఇలా వున్నాయి. విశాఖపట్టణం మద్దిలపాలెంలో పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు కనిపించకుండా పోయారు. వారు ఎటు వెళ్లారో ఎవరికీ అర్థం కాలేదు. కన్యాదానం చేయాల్సిన దంపతులు కనిపించకపోయేసరికి అంతా వెతకగా చివరికి వారి ఇంట్లో విగతజీవులై కనిపించారు.
 
పోలీసులకి ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. విశాఖపోర్టు విశ్రాంత ఉద్యోగి అయిన 63 ఏళ్ల జగన్నాథరావు భార్య 57 ఏళ్ల విజయలక్ష్మి గత కొంతకాలంలగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దీనివల్ల చీటికిమాటికి భర్తతో విజయలక్ష్మి వాదనకు దిగేదనీ, ఎంత సర్ది చెప్పినా ససేమిరా అంటుండేదని ఇరుగుపొరుగువారు చెప్పారు.
 
ఈ కారణంతోనే భర్త విసిగిపోయారనీ, పెళ్లి మంటపంలోనూ ఇలాగే గొడవ పెట్టుకోవడంతో ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెను హత్య చేసి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం తేలనుంది.