గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (09:15 IST)

హత్య కేసు నిందితుడిని పట్టించిన ఈగలు.. ఎలా?

crime
ఓ హత్య కేసులోని నిందితుడుని ఈగలు పట్టించాయి. దీంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. హత్యాస్థలంలో గుమిగూడిన జనంలో ఉన్న హంతకుడి గుట్టును ఈగలు బయటపెట్టాయి. ఆ యువకుడిపైనే ఈగలు వాలుతుండటం గమనించిన పోలీసులు అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది. జబల్‌పూర్‌‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...
 
జబల్‌పూర్ జిల్లాలోని తప్రియా గ్రామంలో గత నెల 30వ తేదీన ఓ హత్య జరిగింది. పనికోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ ఠాకూర్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఊరు చివరున్న పంట పొలాల్లో మనోజ్ మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. గ్రామస్థుల సమాచారంతో హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. 
 
మృతదేహం పడి ఉన్న చోటును, హత్య జరిగిన తీరును పరిశీలిస్తుండగా ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ గుమిగూడిన జనంలో ఓ యువకుడు ధరమ్ ఠాకూర్ శరీరంపై ఈగలు వాలడం పోలీసులు గమనించారు. దీంతో పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేయగా.. ధరమ్ ఠాకూర్ ఛాతీపై రక్తపు మరకలు కనిపించాయి. 
 
అనుమానంతో మరింత లోతుగా, తమదైనశైలిలో విచారించగా, మనోజ్‌‌ను తానే హత్య చేసినట్లు ధరమ్ ఒప్పుకున్నాడు. చివరిసారిగా వారిద్దరూ స్థానిక మార్కెట్లో కోడి మాంసం, మద్యం కొనుగోలు చేశారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వాటి ఖరీదు విషయంలో జరిగిన గొడవే మనోజ్ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ధరమ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.