మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2025 (08:50 IST)

కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి - మృత్యువాత

knife
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ పట్టణంలోని హస్మీ కాలనీలో నివసించే రియాజ్ (24) ద్విచక్రవాహనం దొంగతనానికి పాల్పడినట్టు వచ్చిన సమాచారం మేరకు ప్రమోద్ (42) అనే కానిస్టేబుల్ తన మేనల్లుడుతో కలిసి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
రియాజ్‌ను బైకుపై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళుతుండగా, మార్గమధ్యలో వినాయక్ నగర్ వద్ద రియాజ్ ఆకస్మికంగా కత్తితీసి ప్రమోద్ ఛాతిలో పొడిచాడు. దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో అతని మేనల్లుడిపై కూడా దాడి చేశాడు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి రియాజ్‌ను తప్పించేందుకు ప్రయత్నించగా అక్కడికి వచ్చిన సీసీఎస్ ఎస్ఐ విఠల్ వారిని అడ్డుకున్నాడు. 
 
కానీ, ఆయనపై కూడా నిందితులు విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో ప్రమోద్ మేనల్లుడు, ఎస్ఐ విఠల్‌లు గాయపడ్డారు. ఈ దాడి స్థానికంగా కలకలం సృష్టించిది. అయితే, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.