కేఏ పాల్‌ను బుక్ చేశారు.. లైంగిక వేధింపుల కేసు నమోదు
క్రైస్తవమత మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కేసు నమోదైంది. ఆయనపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, కేఏ పాల్ కంపెనీలో రాత్రిపూట విధులు నిర్వహించే ఓ యువతి ఆయనపై ఫిర్యాదు చేసింది. విధి నిర్వహణలో ఉన్న తనను కేఏ పాల్ తనను లైంగికంగా వేధించారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుకు ఆధారంగా తన మొబైల్ ఫోనుకు వచ్చిన వాట్సాప్ సందేశాలను కూడా జత చేశారు. దీంతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రూ.50 కోసం స్నేహితుల మధ్య గొడవ .. నచ్చజెప్పడానికి వెళ్ళిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు...
ఇద్దరు స్నేహితులు రూ.50 కోసం స్నేహితులు గొడవపడ్డారు. వీరికి నచ్చజెప్పడానికి వెళ్లిన వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
సూరత్ నగరంలోని పాండేసర ప్రాంతం లక్ష్మీనగర్‌లో నివసించే భగత్ సింగ్ (28) తన స్నేహితుడైన బిట్టు కాశీనాథ్ సింగ్ పుట్టిన రోజు పార్టీకి హాజరయ్యాడు. వేడుకల కోసం స్నేహితులంతా కలిసి అల్తాన్‌లోని ఓ హోటల్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాండేసరలోని తిరుపతి ప్లాజా వద్ద అందరూ కలుసుకున్నారు. పార్టీ ఖర్చుల కోసం అనిల్ రాజ్‌భర్ అనే మరో స్నేహితుడు పుట్టిన రోజు జరుపుకుంటున్న బిట్టును రూ.50 ఇవ్వమని అడిగాడు.
ఈ చిన్న విషయంపై వారి మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య వాగ్వాదం ముదరడంతో వారికి నచ్చజెప్పేందుకు భగత్ సింగ్ కల్పించుకున్నాడు. అయితే, క్షణికావేశానికి లోనైన బిట్టు తన వద్ద ఉన్న కత్తితో భగత్ సింగ్, అనిల్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన భగత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు బిట్టుతో పాటు ఘర్షణలో అతనికి సహకరించిన చందన్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు చందన్‌పై గతంలో నాలుగు దోపిడీ, దాడి కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.