మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (13:17 IST)

ఇద్దరి కూలీల ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఓ విషాదం జరిగింది. ఇద్దరు కూలీలు సెప్టెక్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ట్యాంకు నుంచి విష వాయువు సోకడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక కొండపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ ఉంది. దీన్ని శుభ్రం చేసేందుకు భవన యజమాని ఇద్దరు కూలీలను మాట్లాడుకున్నారు. వారిద్దరూ ఆదివారం వచ్చి ట్యాంకును క్లీన్ చేసేందుకు అందులోకి దిగారు. 
 
అయితే, ట్యాంకులో విషవాయు సోకడంతో పాటు.. ఊపిరాడక వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ బృందం అక్కడకు చేరుకుని ట్యాంకులో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీల మృతదేహాలను వెలికితీశారు. 
 
మృతులను నల్గొండ జిల్లా దేవరకొండ మండలం, ఘాజీనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ కుటుంబాలతో కలిసి సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.