1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: బుధవారం, 4 డిశెంబరు 2019 (22:13 IST)

జనసేన పార్టీని ఆ పార్టీలో కలపేయడం ఖాయమేనా?

ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీని విమర్సించకుండా వైసిపి.. జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కూడా జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ వైసిపి నేతలకు కోపం తెప్పిస్తున్నారు. చంద్రబాబు చేసే విమర్సల కన్నా పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలపైనే ఎపి సిఎంతో పాటు మంత్రులు ధీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
 
తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తోంది. అందులోను బిజెపి గురించి.. ఆ పార్టీ ముఖ్య నేత అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ప్రస్తుతం రాజకీయాలు చేయాలంటే అమిత్ షా, మోడీలను చూసి నేర్చుకోవాలి. సున్నితంగా చెబితే ఎవరూ వినరు. గట్టిగా చెప్పాలి అంటూ అమిత్ షా, నరేంద్రమోడీలను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే జనసేనాని బిజెపికి దగ్గర అవుతున్నాడంటూ ప్రచారం జరుగుతుండడం.. పవన్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. 
 
బిజెపిలోకి జనసేన పార్టీని విలీనం చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బిజెపి బలపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీతో కలిస్తే భవిష్యత్తు ఉంటుందన్న నిర్ణయానికి పవన్ కళ్యాణ్‌ వచ్చేశారని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని భావిస్తున్నారు విశ్లేషకులు. మొత్తంమీద నేతలందరినీ కడిగి పారేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపి జపం చేస్తుండడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అన్న ప్రజారాజ్యంను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తమ్ముడు తన పార్టీని మరో జాతీయ పార్టీ బిజెపిలో విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది.