సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: శుక్రవారం, 19 జులై 2019 (14:03 IST)

పేరుకే బ్రేక్ దర్శనం రద్దు... జరుగుతున్నదంతా సేమ్ టు సేమ్... ఎలా?

తెలుగుదేశం హయాంలో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టి దళారీలను ప్రోత్సహించారని, ప్రక్షాళనలో భాగంగా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని ఆర్భాటంగా టిటిడి నూతన ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇది ప్రకటించిన తరువాత దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. విఐపి ప్రోటోకాల్ దర్శనాలు ఆగిపోతే సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం అవుతుందని అనుకున్నారు. ఇదంతా పైకి మాత్రామే. లోపల ఉన్నది తెలిస్తే షాకవ్వాల్సిందే.
 
విఐపి బ్రేక్ ఎల్..1, ఎల్..2, ఎల్..3, దర్సనాలను ప్రోటోకాల్ ప్రకారం ఇస్తూ వస్తున్నారు. వీటి ద్వారా సామాన్య భక్తులకు దర్సనం ఆలస్యమవుతోందని టిటిడి ఛైర్మన్ గుర్తించారు. అంతేకాదు కొంతమంది ఈ దర్సనాల ద్వారా అక్రమంగా డబ్బులు కూడా సంపాదించేస్తున్నారని అనుకున్నారు. 
 
దీంతో వాటిని రద్దు చేయాలని నిర్ణయించుకుని హడావిడిగా నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా బ్రేక్ దర్సనాలు ఎవరు ధరఖాస్తు చేసుకున్నా అందులో ఎల్..1, ఎల్ 2, ఎల్ 3 అని కాకుండా మామూలు బ్రేక్ దర్సనం అని వస్తుంది. ఇక ఈ టిక్కెట్టు పుచ్చుకుని నేరుగా జెఈఓ ఆఫీస్‌కు వెళ్ళి సర్, నేను మంత్రి గారి పిఎని, సర్, నేను ఎమ్మెల్యే తమ్ముడిని, సర్.. నేను కేంద్రమంత్రి దగ్గర బంధువుని ఇలా చెబితే చాలు అక్కడున్న సిబ్బంది ఆ టిక్కెట్టుపై స్టాంప్ వేసి పంపుతారు. ఆ స్టాంప్ వేసిన టిక్కెట్టు తీసుకొని మరో మార్గం ద్వారా ఆలయంలోకి త్వరగా వెళ్ళొచ్చు. అంతేకాదు ఆ స్టాంప్ చూస్తే కాసేపు వారిని ఆపి హారతి ఇచ్చి మరీ టిటిడి వేదపండితులు పంపుతారు.
 
ఇంకేముంది ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 తరహాలోనే ఈ విధానం కూడా తయారైందని ప్రశ్నిస్తున్నారు సామాన్య భక్తులు. టిటిడి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా క్రిందిస్థాయి అధికారులు స్టాంప్‌లు వేసి విఐపిలు అని వేరే మార్గం ద్వారా పంపించడం వల్ల వారు ఆలయంలో కాసేపు నిలబడి దర్సనం చేసుకుంటారు. ఇలా ఎంతోమంది విఐపిలు స్టాంప్‌లు వేసుకుని వెళితే వారే గంటల తరబడి ఆలయంలో ఉంటారు. ఇక మేమెప్పుడు దర్సనం చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు సామాన్య భక్తులు. మరి చూడాలి సామాన్య భక్తుల డిమాండ్‌తో మళ్ళీ వెనక్కి తగ్గి దర్సన విధివిధానాలపై పునరాలోచిస్తారా. లేకుంటే అలాగే వదిలేస్తారో..?