చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : టిటిడి ఈవో
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని మంగళవారం రాత్రి 7 గంటలకు మూసివేసినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆలయం తలుపులు మూసివేసిన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు.
ఈవో మాట్లాడుతూ బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుండి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని, గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఉదయం 11 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైందని, ఇప్పటివరకు 37,144 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. అన్నప్రసాద భవనాన్ని కూడా మూసివేశామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 20 వేల మంది భక్తులకు పులిహోర, టమోటా రైస్ ప్యాకెట్లు అందించామని వివరించారు.
బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారని చెప్పారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ ఏకాంతంగా నిర్వహిస్తామని, అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఆణివార ఆస్థానం ఆగమోక్తంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆ తరువాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటివరకు భక్తులు బాగా సహకరించారని, రేపు కూడా దర్శన సమయం తక్కువగా ఉండడంతో భక్తులు సహకరించాలని కోరారు.
ఈవో వెంట టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికారులు ఉన్నారు.