బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (13:51 IST)

వైకాపా రాజ్యసభ అభ్యర్థులుగా 'ఆ ముగ్గురు'?

ఏప్రిల్ నెలలో రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైకాపాకు నాలుగైదు సీట్లను దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో వైకాపా తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించే వారు ఎవరైవుంటారన్న చర్చ అపుడే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మొదలైంది. 
 
నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో సీఎం జగన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చలు ఏం సూచిస్తున్నాయన్న అంశంపై చర్చ సాగుతోంది. ముఖ్యంగా, ప్రస్తుతం రాజకీయ పరిశీలకులను వేధిస్తున్న ప్రశ్నలివి. 
 
ఏప్రిల్‌లో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైసీపీ సంఖ్యాబలం పెరగనుండటాన్ని అవకాశంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు పొందాలని జగన్‌ భావిస్తున్నారన్నది వారి తాజా అంచనా. 
 
అయితే, రాజ్యసభకు వైసీపీ అధిష్టానం.. ఎవరిని పంపాలని భావిస్తోందన్న అంశంపై ఓ ఆసక్తికర ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మండలి రద్దు వ్యవహారం కేంద్రం పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ కేంద్రం కూడా మండలి రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల్లో ఒకరైన మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. 
 
అలాగే, రాజ్యసభకు వైసీపీ నుంచి ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా నామినేట్ కానున్నట్లు వార్తలొస్తున్నాయి. వారిలో ఒకరు రామ్‌కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కాగా, మరొకరు టీడీపీని వీడి వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త బీద మస్తాన్‌రావ్ అని తెలిసింది. వీరిద్దరికీ రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.