శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (12:30 IST)

శనిదోష నివారణకు దీపావళి రోజు ఏం చేయాలంటే..?

దీపావళి రోజు ఉదయాన్నే తలకిస్నానం చేసి మూడు గుప్పెడల నల్ల నువ్వులు ఓ తెల్లటి గుడ్డలో మూట కట్టాలి. ఒత్తి ఆకారంలో వచ్చేలా మూట కట్టి నువ్వుల నూనెలో నానపెట్టాలి. దీపావళి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీపూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర దివ్వ కొడతారు. ఇల్లంతా లక్ష్మీ కళ ఉట్టిపడేలా దీపాలతో అలంకరించి బాణసంచా వెలిగిస్తాం. మొత్తం అంతా పూర్తైంది ఇక ఇంట్లోకి వెళ్లిపోవడమే అనే సమయంలో ఈ నువ్వుల దీపాన్ని వెలిగించాలి.
 
బాణసంచా కాల్చడం పూర్తయ్యాక ఇక పండుగ హడావుడి పూర్తైంది లోపలకు వెళ్లిపోవడమే అనే సమయంలో... ఉదయం నుంచి నానబెట్టి ఉంచిన నువ్వుల దీపాన్ని ప్రత్యేక ప్రమిదలో వెలిగించి ఇంటి ఆరు బయట, నగరాల్లో ఉన్నవారైతే ఇంటి గేటు బయట ఓ మూలగా వెలిగించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోవాలి. మూట కట్టిన నువ్వులన్నీ మసైపోయే వరకూ దీపం వెలిగేలా కర్పూరం పొడి లాంటివి కూడా దానిపై వేయొచ్చు. ఇలా చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుందని చెబుతారు. 
 
కొందరు ఇంటి ముందు దీపాలు పెట్టడం కన్నా ముందే శనిదీపం వెలిగించి అది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఇల్లంతా దీపాలు పెడతారు. అంటే శనిని తరిమికొట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నామని అర్థం వచ్చేలా. అయితే శనిదీపం ఎప్పుడు పెట్టినా మంచిదా... దీపాల వరుసతో సమానంగా కాకుండా ఆరంభంలో కానీ చివర్లో కానీ వెలిగించడం ఉత్తమం. వైద్యం కన్నా నమ్మకం ప్రధానం అన్నట్టు ఇదికూడా అంతే. ఇలాచేస్తే శనిప్రభావం తగ్గుతుందనే భావన కూడా సగం బలాన్నిస్తుందంటారు పెద్దలు. ఇక ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు ఫాలో అవొచ్చు.