సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (17:35 IST)

ఈ మూడు ఆహారాలతో మీ రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోండి

భారతదేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా రెండవ, అతి ప్రమాదకరమైన కోవిడ్‌- 19 తీవ్రతను చూస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రత్యేక శ్రద్ధను చూపడం ఇప్పుడు మరింత అవసరం. నూతన లాక్‌డౌన్‌ నిబంధనలను స్వీకరించేందుకు మనమంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్‌, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడమనేవి వైరస్‌‌తో పోరాడటంలో మనకు రక్షణ కవచాలుగా నిలుస్తాయి.
 
ఈ తరహా కష్టకాలంలో ఒకరు ఏవిధంగా తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి? దీనికి సమాధానం చాలా సులభం. సరైన ఆహారం తీసుకోవాలి. చక్కటి పౌష్టికాహారం మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలి అనేవి ఎప్పుడూ కూడా ప్రాధాన్యతాంశాలు. కానీ ఇప్పుడు మరీనూ! ఎందుకంటే పోషకాలు అధికంగా కలిగిన ఆహారం శక్తివంతమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. మీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే మరియు భారతీయ వేసవికి తగిన మూడు ముఖ్యమైన ఆహారాలు ఇవిగో!
 
పోషకాలు అధికంగా ఉన్న బాదములు
డైట్‌లో అతి సులభంగా జోడించతగిన చక్కటి ఆహారంలో ఒకటిగా బాదములు నిలుస్తాయి. పోషకాలు అధికంగా వీటిలో ఉంటాయి. అంతేకాదు ఆకలిని తీర్చే గుణమూ వీటిలో ఉంది. ఆరోగ్యవంతమైన, రుచికరమైన స్నాక్‌గా కూడా ఇది నిలుస్తుంది. అదనంగా, వీటిలో పలు పోషకాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధకశక్తిని సానుకూలంగా పెంపొందిస్తాయి. ఉదాహరణకు, బాదములలో విటమిన్‌ ఇ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతో పాటుగా శ్వాససంబంధిత రోగ నిరోధక వ్యవస్ధకూ తోడ్పడుతుంది.
అంతేకాదు, వైరస్‌, బ్యాక్టీరియా కారణంగా ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా కూడా రక్షణను విటమిన్‌ ఇ అందిస్తుంది. వీటితో పాటుగా, బాదములలో రాగి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేయడానికి కూడా రాగి తోడ్పాటునందిస్తుంది. బాదములలో జింక్‌ సైతం అధికంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపరచడంలో జింక్‌ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ఇతర రోగ నిరోధక శక్తి, న్యూట్రోఫిల్స్‌, సహజసిద్ధమైన కిల్లర్‌ కణాలు అభివృద్ధికి కీలకం. ఇక బాదములలో లభించే అతి ముఖ్యమైన పోషకం ఐరన్‌. రోగ నిరోధక శక్తి కణాలు పెరగడానికి అవి పరిపక్వత సాధించడానికి మరీ ముఖ్యంగా ఎలాంటి అంటువ్యాధికి వ్యతిరేకంగా అయినా నిర్ధిష్టమైన స్పందనను అందించేందుకు కీలకమైన లింపోసైట్స్‌ వృద్ధి చేయడంలో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది.
 
ప్రొ బయాటిక్‌ అధికంగా కలిగిన యోగర్ట్‌
గడ్డకట్టిన, ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌ ఈ సంవత్సరం ఎండలను అధిగమించేందుకు అత్యుత్తమ మార్గంగా నిలుస్తుంది. యోగర్ట్‌లో అత్యధికంగా ప్రొబయాటిక్స్‌ ఉంటాయి. ఇవి సూక్ష్మజీవులు మరియు ఓ వ్యక్తి యొక్క ప్రేగులకు మంచివి. రోగనిరోధక శక్తి బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ప్రతి రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుంది. అలాగే ఆ వ్యక్తి ప్రేగులలో సైతం చక్కటి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. వ్యాధికారకాలు (పాతోజెన్స్‌)కు వ్యతిరేకంగా రక్షణను మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది.
అదనంగా యోగర్ట్‌లో కాల్షియం, మినరల్స్‌, కీలకమైన విటమిన్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అత్యంత కీలకమైనవి మరియు సీజనల్‌ ఫ్లూ నుంచి ఒకరిని కాపాడటంలో కూడా తోడ్పడుతుంది. అందువల్ల, మీ భోజనంతో పాటుగా తగిన మొత్తంలో యోగర్ట్‌ను జోడించుకోవడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ కాలంలో.
 
విటమిన్‌ సి అధికంగా కలిగిన పచ్చిమామిడి
పచ్చి మామిడిలో అధికమొత్తంలో విటమిన్‌ ఎ ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో ఇది తోడ్పడుతుంది. అలాగే ఈ మామిడిలో విటమిన్‌ సి సైతం అధికంగా ఉంటుంది. ఫాగోసైట్స్‌ పనితీరు మెరుగపరచడంలో ఇది సహాయపడుతుంది. హానికారక బ్యాక్టీరియా కణాలను నాశనం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

మీరు కాస్త కారం లేదంటే ఉప్పు చల్లుకుని ఈ పచ్చిమామిడి తినవచ్చు లేదంటే మ్యాంగో పన్నాను కూడా దీని నుంచి తయారు చేయవచ్చు. దీనిని చట్నీగా కూడా తయారుచేసుకుని లంచ్‌, డిన్నర్‌ సమయాలలో ఆరగించవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఏమిటంటే, మీ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి మీ రోజువారీ ఆహారంలో పచ్చిమామిడిని మాత్రం జోడించుకోండి.
 
-రితికా సమద్దార్‌, రీజనల్‌ హెడ్-డైటెటిక్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌- ఢిల్లీ