సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 20 ఆగస్టు 2020 (20:01 IST)

మునగ మేలు చేస్తుంది కదా అని ఎక్కువ తీసుకుంటే ఏం చేస్తుందో తెలుసా?

మునగకాయలు, మునగ ఆకులను మనం కూరల్లో తింటుంటాం. ఐతే ఈమధ్య కాలంలో కొందరు మునగ సూప్ అని ఎక్కువగా సేవించడం మొదలుపెడుతున్నారు. మునగతో ప్రయోజనాలు వున్నప్పటికీ అధికంగా తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.
 
మునగలో ఐరన్, కాల్షియం, ఎసెన్షియల్ విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వున్నాయి. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను దరిచేరనివ్వదు. మునగ ఆకులు, విత్తనాలు, పువ్వులు వినియోగానికి ఖచ్చితంగా సురక్షితమే. అయినప్పటికీ పెద్ద మొత్తంలో మునగ సూప్ లేదా వాటి విత్తనాలు కొన్ని దుష్ప్రభావాలను చూపిస్తాయి. కొందరు మునగ వేర్లను తీసి దాన్ని సూప్‌గా తీసుకుంటుంటారు. అందులో స్పిరోచిన్ అనే విష పదార్థం ఉన్నందున నోటి ద్వారా తీసుకున్నప్పుడు అది హాని చేస్తుంది.
 
మునగను భారీ మొత్తంలో తింటే వాటిలో ఆల్కలాయిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే హృదయ స్పందన రేటు కూడా నెమ్మదిస్తుంది. మునగ బెరడు తినడం గర్భాశయ సంకోచాలను కలుగజేస్తుంది. థైరాయిడ్ మందులను వాడేవారు మునగ అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణుల చెపుతున్నారు. రక్తపోటును తగ్గించే గుణాన్ని మునగ కలిగి వున్నందున రక్తపోటు మందులతో మునగ తీసుకోవడం మంచిది కాదు.
 
ఐతే మునగలో అపారమైన పోషక ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్లు ఎ, సి, కె, బి కాంప్లెక్స్, ఖనిజాలు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి ఉన్నాయి. ఆహారంలో మునగను క్రమం తప్పకుండా చేర్చుకోవడం మధుమేహాన్ని నియంత్రించడానికి సాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మునగ బెరడు, ఆకులు, పువ్వులు, విత్తనాలను సాంప్రదాయ వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. కాబట్టి మునగ మేలు చేస్తుంది కదా అని మరీ ఎక్కువగా తీసుకోకూడదు.