శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (18:13 IST)

లాక్ డౌన్‌లో వ్యాయామం: షోల్డర్‌... టేక్‌ కేర్‌...

లాక్‌డవున్‌ కారణంగా వ్యాయామ ప్రియులు అనేకమంది అలవాటు లేని కొత్త రకం వర్కవుట్స్‌ని ప్రయత్నించారు. వీటిలో ఆటలు కూడా ఉన్నాయి. ఖాళీ సమయం దొరికిందనే ఆలోచనతో.. టెన్నిస్, వాలీబాల్, స్విమ్మింగ్, క్రికెట్‌... వంటి ఆటలు సరదాగా ఆడిన వారిలో అనేక మంది భుజాల నొప్పులు, వాపులు.. వంటి సమస్యలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. ఈ నేపధ్యంలో భుజాల నొప్పులకు కారణాలు, పరిష్కారాలను వివరిస్తున్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌ వైద్యులు ఆర్థోపెడిక్, జాయింట్‌ రీప్లేస్‌ మెంట్‌ సర్జన్‌ డా.వీరేందర్‌. 
 
కారణాలెన్నో...
ఒకటే తరహాలో భుజాలను పదే పదే రొటేట్‌ చేయడం వల్ల అది లిగ్మెంట్స్‌ వదులుగా మారడానికి, భుజాలు జారిపడే ప్రమాదాన్ని పెంచడానికి కారణమైంది.  ఆటలు ఆడేటప్పుడు గానీ వ్యాయామ సమయంలో గానీ భుజాల వద్ద ఎటువంటి అనుభూతి కలుగుతుందో నిశితంగా గమనిస్తుండాలి. భుజాల కదలికల్లో అపసవ్యత గానీ, నొప్పి లేదా జారినట్టు అనిపించడం వంటివి ఉంటే వెంటనే ఫిజియో థెరపిస్ట్‌ని సంప్రదించాలి. అలవాటు లేని, ఫిజియో థెరపిస్ట్‌ పర్యవేక్షణ లేకుండా ఆటలు ఆడేవాళ్లలో ప్రమాదంగా పరిణమించే కొన్ని సమస్యలు...
 
టెండెనిటైస్‌: ఈ సమస్య టెన్నిస్, బ్యాడ్మింటన్‌ ఆడేవాళ్లు తరచుగా ఎదుర్కుంటారు. భుజాల నొప్పి తో ప్రారంభమై ఇది మరింత తీవ్రమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.
 
ఇంపింగ్‌మెంట్‌: స్విమ్మింగ్‌ చేసేవాళ్లు, టెన్నిస్, గోల్ఫ్‌ ఆడేవాళ్లలో ఇది కనిపిస్తుంటుంది. వెంట వెంటనే భుజాన్ని రొటేట్‌ చేసే వాళ్లలో ఈ పరిస్థితి వస్తుంది. భుజాల దగ్గర అసౌకర్యంగా ఉండడం, నొప్పి ఉంటాయి. కొన్ని సార్లు భుజాలపై ఏ మాత్రం ఒత్తిడి తగిలినా నిద్రను కూడా దూరం చేస్తుంది.
ల్యాబ్రల్‌ టియర్‌: ఇది భుజాలు పట్టు తప్పడం వల్ల, లేదా భుజంపై ఆకస్మికంగా ఒత్తిడి పడడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. భుజాలను కదిలిస్తున్నప్పుడు  అందలోని అపసవ్యత, కొన్ని గంటల పాటు నొప్పి గమనించవచ్చు.
 
రొటేటర్‌ కఫ్‌ టియర్స్‌: భుజాన్ని విపరీతంగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా  చేయి బలంగా తిప్పాల్సిన అవసరం ఉండే ఆటలు ఆడేవారికి ఈ సమస్య ఎక్కువ. టెన్నిస్, క్రికెట్, త్రోబాల్‌..వంటివి. ఇది తీవ్రమైన నొప్పి కలిగించే సమస్య.
 
క్వాడ్రైలేటరల్‌ సిండ్రోమ్‌: ఇది భుజంలోని నరాలకు సంబంధించింది. భుజాల నొప్పితో పాటు చేతులు తిమ్మిరిగా ఉండడం, జలదరింపు... వంటివి కలుగుతాయి.
 
ఈ రకమైన ఆటలు ఆడినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... భుజ కండరాలను అతిగా వాడినప్పుడు పలు రకాల గాయాలు, సమస్యలు వస్తాయని. కాబట్టి, కఠినమైన ఆటలు ఆడే సందర్భంలో వీలున్నంతగా కండరాలకు విశ్రాంతిని కూడా ఇవ్వాలి. భుజాల నొప్పులు రెండు రోజులకు పైగా కొనసాగితే ఫిజికల్‌ థెరపిస్ట్, లేదా వైద్యుల్ని సంప్రదించాలి. అదే విధంగా ఆటలు ఆడే ముందుగా.. భుజాల సమస్యలు రాకుండా... గోడకు చేతిని ఆనించి చేసే వాల్‌ స్ట్రెచెస్, చేతుల్ని నేలవైపు# వేలాడేసి, భుజంలోని కండరాలు రిలాక్స్‌ అయేలా చేసే పెండ్యులమ్‌ మూమెంట్‌ వంటి స్ట్రెచ్‌ వ్యాయామాలు ఉపకరిస్తాయి.
 
- డా.వీరేందర్‌, ఆర్థోపెడిక్, జాయింట్‌ రీప్లేస్‌ మెంట్‌ సర్జన్‌, అపోలో స్పెక్రా ఆసుపత్రులు