పగటి పూట పుచ్చకాయ మంచిదే.. కానీ రాత్రిపూట వద్దే వద్దు..
వేసవిలో పుచ్చకాయను ఇష్టపడనివారు వుండరు. ఎండలు మండిపోయినప్పుడు ఈ పండు తింటే ఒళ్లంతా చల్లబడుతుంది. పుచ్చకాయలో చాలా విటమిన్లు, పోషకాలు వుంటాయి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.
అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగుపరిచే శక్తి పుచ్చకాయకు ఉంది. అతిదాహం, చెమట ద్వారా వెళ్లిపోయే ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తి వస్తుంది. వేసవిలో పుచ్చకాయను పగటి పూట తింటే తిన్నారు కానీ రాత్రి పూట మాత్రం పుచ్చకాయను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత, నిద్రించేందుకు ముందు పుచ్చకాయను తీసుకుంటే.. అందులో అధిక మోతాదులో వుండే నీరు, ఆమ్లాలు జీర్ణక్రియను అడ్డుకుంటాయని.. దీంతో కడుపులో నొప్పి ఏర్పడుతుందని వైద్యులు చెప్తున్నారు.