గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 16 అక్టోబరు 2021 (22:12 IST)

ఏం తినాలి? ఎంతెంత తినాలి?

మనం తీసుకునే ఆహారంలో ఐదు రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. 1. తృణధాన్యాలు, గింజలు, వాటి ఉత్పత్తులు. 2.పప్పు ధాన్యాలు 3. పండ్లు కూరగాయలు 4. పాలు, మాంసం, చేపలు, గుడ్లు 5. నూనెలు, చక్కెర.
 
సమతుల ఆహారంలో 50 నుండి 70 శాతం వరకూ క్యాలరీలు కార్బోహైడ్రేట్‌ల నుంచి లభించాలి. 10 నుండి 15 శాతం ప్రొటీన్స్, 20 నుంచి 25 శాతం ఫ్యాట్‌నుంచి లభించే పదార్థాలుండాలి. అలాగే పోషక విలువలుగల ఆహారాన్ని అవసరమైనంత ప్రమాణంలో తీసుకోవాలి.
 
ఆహారం తీసుకోవడానికి ఉపయోగించే ప్లేటు కనీసం తొమ్మిది అంగుళాల వ్యాసం వుండాలి. ప్లేటును రెండు సమభాగాలుగా అనుకోండి ఒక భాగాన్ని మరో విధంగా ఊహించండి. ప్లేటులో ఎక్కువగా వున్న భాగంలో టమేటో, ఉల్లిపాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తాజా బీన్స్, క్యారెట్, తోటకూర వంటి కూరలతో నింపాలి.
 
రెండు చిన్న భాగాల్లో ఒకదానిలో గోధుమ, జొన్న, సజ్జలు, ఓట్స్, బియ్యం, కార్న్, బంగాళాదుంపలతో గల పిండి పదార్థాలను తీసుకోవాలి. తక్కిన సగభాగం చేపలు, మాంసం, గుడ్లు, సోయా బీన్స్, పప్పు ధాన్యాలతో గల వంటకాలు తీసుకోవాలి. చివరగా తక్కువ ఫ్యాట్‌గల 240 ఎం.ఎల్. పాలు లేదా ఏదైనా ఒక పండుతోపాటు పెరుగు, అరకప్పు ఫ్రూట్ సలాడ్ తీసుకోవాలి.
 
ఉదయం పూట తీసుకునే అల్పాహారం తగిన మోతాదులో ఉండాలి. ప్లేటులో సగం తృణధాన్యం వుండాలి. పావు ప్లేటులో పండ్లు, గుడ్లు, పాలు లేదా పాల ఉత్పత్తులు ఉండాలి. ఇవి తీసుకోవడమే కాదు తగినన్ని నీళ్లు కూడా తప్పకుండా తాగాలి.
 
రోజుకు మూడు సార్లు భోజనం తప్పకుండా చేయాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు స్నాక్స్ తీసుకోవచ్చు. భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. వీలైనంతవరకూ వీటితోపాటు విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.