ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 అక్టోబరు 2019 (11:21 IST)

మలేరియా రాకుండా వుండాలంటే ఈ ఆకు నమలాల్సిందే

వర్షాకాలంలో మలేరియా లాంటి వైరల్ జ్వరాలకు తులసి మంచి విరుగుడు. తులసి ఆకుల కషాయం జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది. తులసి ఆకులతో ఆవిరి పడితే జలబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఈ కషాయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా శ్వాస సంబంధ వ్యాధులకు మంచి ఉపశమం కలుగుతుంది. దీన్నే ఆరోమా థెరపీ అనికూడా అంటుంటారు.
 
* తులసి ఆకులను టీలో మరిగించి కూడా తీసుకోవచ్చు. టీకి మంచి సువాసనతో పాటు ఘాటైన రుచి కూడా వస్తుంది. వానాకాలంలో ఇది చాలా మేలు చేస్తుంది. ఏడాది నిండిన పిల్లలకు రోజూ ఒక చెంచా తులసి రసం తాగిస్తే జీర్ణ శక్తి పెరుగుతుంది. తరచూ జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు.
 
* కళ్ళు మండుతున్నా, ఎరుపెక్కినా తులసి కషాయం పలుచగా చేసి.. దాంతో కళ్ళు కడిగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. నీడన ఆరబెట్టిన తులసి ఆకులను పొడి చేసి... ఒక టీస్పూన్ పొడికి, చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
 
* తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి. తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి. అయితే దీనిని ఎక్కువగా వాడకూడదు. రోజూ పది పదిహేను ఆకుల్ని మించి తినకండి. ఆకులు కాస్త చేదుగా, వగరుగా ఉంటాయి. కనుక కడుపులో ఒకలాంటి ఇబ్బందిగా ఉంటుంది.