శనివారం, 24 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (12:30 IST)

కృష్ణా పుష్కర ఘాట్లను గుర్తించండి... దేవాదాయ శాఖ

దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు కృష్ణా పుష్కరాలకు సిద్ధమవుతున్నారు. అప్పడే పుష్కర ఘాట్లను గుర్తించేందుకు దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఆ శాఖ గుంటూరు జోన్‌ ఉప కమిషనర్‌ (డీసీ) సురేష్‌బాబు, ఏసీ కేబీ శ్రీనివాసులు డీసీ కార్యాలయంలో కృష్ణా పుష్కర ఏర్పాట్లపై తొలిసారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం డీసీ సురేష్‌బాబు మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.  జిల్లాలో సాధ్యమైనంతవరకు అధిక సంఖ్యలో పుష్కర ఘాట్లను గుర్తించాలన్నారు. గత కృష్ణా పుష్కరాలకు 52 ఘాట్లు నిర్మాణం జరిగిందన్నారు. ఈసారి అదనంగా 20 ఘాట్లను ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. ఇప్పటికే 72 ఘాట్లు అయినప్పటికీ ఇంకా మరిన్ని ఘాట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేయాలన్నారు. 
 
జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయా చోట్ల గతంలో ఏర్పాటు చేసిన ఘాట్లు ఎలా ఉన్నాయి, కొత్తగా ఇంకా ఎక్కడెక్కడ ఘాట్లు నిర్మాణం చేయవచ్చు, వాటికి సమీపంలో ఏఏ ఆలయాలు ఉన్నాయి వాటిని పటం రూపంలో రూపొందించి నివేదికలను ఆలయ కార్యనిర్వహణాధికారులు, మేనేజర్లు, డివిజన్ల ఇన్స్‌పెక్టర్లు రెండు రోజుల్లోగా అందజేయాలని అధికారులు ఆదేశించారు.