హరహర మహాదేవ : భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలో మూడో సోమవారంకావడంతో భక్తులు శివాలయాలకు క్యూకట్టారు. ఫలితంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులు చేసే శివనామా స్మరణతో మార్మోగిపోతున్నాయి.
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో దైవ దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే, నాగులకట్ట వద్ద మహిళా భక్తులు కార్తీక మాస నోములు నోచుకున్నారు.
ఇకపోతే, వెస్ట్ గోదావరి జిల్లాలో జుత్తిగ ఉమావాసుకిరవిసోమేశ్వర స్వామి ఆలయంలోనూ, తూర్పు గోదావరి జిల్లా యానాంలోని రాజరాజేశ్వర సహిత రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే, అభిషేకాలు చేస్తున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ సన్నిధికి కూడా భక్తులు పోటెత్తారు.