పూలతో ఇంటిని ఇలా తీర్చిదిద్దండి!
ఇంటిని తాజా పూలతో అలంకరించుకోవాలనే ఆశ చాలామందికి ఉంటుంది. కాకపోతే పూలు అలంకరించిన కొద్ది గంటలకే కనీసం ఫంక్షన్ ప్రారంభం కాకముందే వాడిపోయినట్లు కనిపిస్తాయి. అలా కాకుండా తాజాగా ఎక్కువ సేపు ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
మీరు గదిలో అలంకరించుకోవాలనుకున్న పువ్వులు సాయంత్రం పూటే కోసుకోండి. కోయగానే వాటిని మంచినీటిలో ఉంచండి. పూల కాడలు కత్తిరించేముందు మంచినీటిలో ఉంచిన తర్వాతనే కత్తిరించాలి. అలా చేస్తే పువ్వులు ఎక్కువసేపు తాజాగా ఉంటాయి.
అలాగే గులాబీ పూలతో మీ గదిని అలంకరించుకోవాలనుకుంటే ముందుగా వాటి కాడల్ని ఒకసారి వేడినీటిలో ఉంచి వెంటనే తీసి చల్లని నీటిలో ఉంచండి. అలంకరణ కోసం పాలుగారే కొమ్మల్ని ఎంచుకుంటారు కొందరు. వాటిని నేరుగా వాడకూడదు. ముందుగా ఆ కొమ్మల్ని సన్నని సెగపై కాల్చి ఆ తర్వాతనే వాడాలి.
పుష్పాలంకరణ చేయగానే సరిపోదు. ముందుగా గదుల విస్తీర్ణం, వాటిని ఏ స్థలంలో అలంకరణ చేయాలి. వాటి బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి. అవి అందరికీ నచ్చుతాయాలాంటి విషయాలపై అవగాహన ఉండాలి. గదులను బట్టి అలంకరణ అనేది ఉండాలి. విశాలమైన స్థలం ఉన్న గదులలో రెండు రకాల అలంకరణలు చేసేటప్పుడు రెండూ పక్కపక్కనే ఉండకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి. రెండు అలంకరణలు కూడా విభిన్నంగా కనిపించాలి.
ఎండవేడి తగలకుండా...
పువ్వులకు సాధ్యమైనంతవరకూ ఎండ వేడిమి తగలకుండా చూసుకోవాలి. అలా చేస్తే కొమ్మలు వాడిపోయినట్లు కనిపించి చూసేవారికి అలంకరణ హీనంగా కనిపిస్తాయి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పువ్వులతో అలంకరణ ఇంటికి చక్కని శోభనిస్తుంది. ఫంక్షన్లో కూడా పదిమందీ మీరు చేసిన అలంకరణపై దృష్టిని కేంద్రీకరిస్తారు. మిమ్మలను అభినందలనలో ముంచెత్తుతారు.