బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:58 IST)

కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఏం చెప్పిందో తెలుసా?

కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు, తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా! 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో  ప్రయాణించలేదు. కరోనా వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో ఎంతసేపు నిలిచి ఉంటే, అంతసేపు ఉంటుంది.

అలా బయటకు వచ్చిన డ్రాప్లెట్స్ కుర్చీ, టేబుల్, తలుపులు, డోర్ నాబ్స్, బస్సు, ట్రెయిన్లో ఉండే స్టీల్ రాడ్స్ మొదలైనటువంటి ఉపరితలాలకు(surfaces)కి అంటుకొని ఉంటుంది. వాటిని మనం తాకి, అదే చేతితో నోరు, ముక్కు, కంటిని తాకితే, మన శరీరంలోకి చేరుతుంది. ఇతరుల్ని తాకితే, వారికి అంటుకుంటుంది.
 
కరోనా ఏ మార్గం ద్వారా ఒకరి నుండి ఒకరికి వెళుతుందో గుర్తు పెట్టుకొని, W.H.O సూచించిన క్రింది జాగ్రత్తలు పాటించాలి.
 
1. మీ చేతులను తరచుగా కడగాలి. బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్‌లో ఉన్న surfacesని తాకడం వల్ల వైరస్ అంటుకుంటుంది కాబట్టి, చేతులను ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్‌తో రుద్దుకోవాలి. లేదా సబ్బు మరియు నీటితో కడగాలి. అలా చేస్తే మీ చేతుల్లో ఉండే వైరస్లు చనిపోతాయి. 
 
2. భౌతిక దూరాన్ని పాటించండి. దగ్గు లేదా తుమ్ము ఉన్నవారికీ మీకూ మధ్య కనీసం ఒక మీటర్ (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోండి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వారి ముక్కు లేదా నోటి నుండి వచ్చే తుంపర(ద్రవ బిందువులు)లో వైరస్ ఉండవచ్చు. వారికి దగ్గరగా ఉండటం వల్ల ఆ బిందువులలో పాటు కరోనా వైరస్‌ని పీల్చుకోవడం వల్ల COVID-19 రావొచ్చు. 
 
3. కళ్ళు, ముక్కు మరియు నోరు తాకడం మానుకోవాలి. పూర్తి స్పృహలో ఉండి, ముఖాన్ని తాకే అలవాటును మార్చుకోండి. ఎందుకంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు కుర్చీలు, టేబుల్స్, బస్సులో, ట్రెయిన్‌లో సపోర్టు కోసం వాడే స్టీల్ రాడ్స్ వంటి ఉపరితలాలను చేతులతో తాకుతాము. అలా వైరస్లు చేతులకు అంటుకొని, మీ కళ్ళు, ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్థాయి. 
 
4. మీరు మరియు మీ చుట్టుపక్కల ప్రజలు శ్వాసకోశ పరిశుభ్రతను పాటించేలా చూసుకోండి. దగ్గు లేదా తుమ్ము ఉన్నప్పుడు మీ వంచిన మోచేయి లేదా టిష్యూ పేపర్‌తో నోరు మరియు ముక్కును కప్పాలి. అలా వాడిన టిష్యూ పేపర్‌ని వెంటనే పారవేయాలి. ఇలా కాకుండా నేరుగా చేతులు అడ్డు పెట్టుకోవడం వల్ల, ఆ వైరస్ మీ చేతులకు అంటుకొని, ఇతర ఉపరితలాలకు వ్యాప్తి చెందుతుంది.
 
5. మీకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వైద్య సహాయం తీసుకోండి. స్థానిక ఆరోగ్య అధికారుల సూచనలను అనుసరించండి. వారి వద్ద తాజా సమాచారం ఉంటుంది. ముందుగానే కాల్ చేస్తే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత మిమ్మల్ని త్వరగా సరైన ఆరోగ్య సదుపాయాన్ని కల్పిస్తారు.
 
6. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో లేదా ఇటీవల (గత 14 రోజులు) సందర్శించి ఉంటే, ముందుగా  స్థానిక ఆరోగ్య అధికారికి ఫోన్ చేసి సమాచారం అందించండి. వారు అవసరమైన పరీక్షలు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతారు.
 
కరోనా హెల్ప్ లైన్: ఏపీ - 08662410978, తెలంగాణ - 104, కేంద్ర హెల్ప్ లైన్:  +91-11-23978046
 
మాస్క్ ఎప్పుడు, ఎలా ధరించాలి?
మీ ఆరోగ్యం బాగుగా ఉండి, కరోనా సంక్రమించినట్టు అనుమానం ఉన్న వ్యక్తికి సపర్యలు చేస్తూ ఉంటే మాస్క్ ధరించాలి. లేదా మీకు దగ్గు లేదా తుమ్ము ఉంటే  ధరించాలి. లేదా మూడు అడుగుల సామాజిక దూరాన్ని పాటించడం కుదరని బస్సు, ట్రెయిన్లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలి. ఇవేమీ లేనప్పుడు, ఇంటిలో ఉండగా మాస్క్ అవసరం లేదు. 
 
ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో చేతిని శుభ్రపరచుకున్నాకే మాస్క్‌ని తాకాలి. లేకుంటే, చేతికి ఉన్న వైరస్ మాస్క్‌కి అంటుకొని వైరస్ శరారంలోకి ప్రవేశించవచ్చు. మాస్క్‌తో నోరు మరియు ముక్కును పూర్తిగా కప్పండి. మరియు మీ ముఖం మరియు ముసుగు మధ్య ఖాళీ లేకుండా చూసుకోవాలి. మాస్క్ వేసుకున్నాక దాన్ని తాకడం మానుకోండి.

ఒక వేళ తాకితే ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్ లేదా సబ్బు మరియు నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి. మాస్క్ తడిగా ఉంటే అది పడేసి కొత్తది వేసుకోండి. సింగిల్-యూజ్ మాస్క్‌లను తిరిగి ఉపయోగించవద్దు. మాస్క్ తొలగించడానికి తాళ్లను పట్టుకొని మాత్రమే తొలగించాలి. (ముసుగు ముందు భాగంలో తాకవద్దు) మూత ఉన్న చెత్త డబ్బాలో వెంటనే పడేసి, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో చేతులు శుభ్రం చేయండి.
 
కరోనా గురించి ఉన్న కొన్ని అపోహలు
1. కరోనా వైరస్ వేడిగా ఉండే మన దేశంలో వ్యాపించదు అనేది కేవలం అపోహ. ఇప్పటివరకు లభించిన ఆధారాల నుండి, కరోనా వైరస్ వేడి మరియు తేమతో కూడిన వాతావరణంతో సహా అన్ని ప్రాంతాలలో వ్యాపిస్తుంది. 
 
2. వేడి స్నానం చేయడం వల్ల కొత్త కరోనా వైరస్ వ్యాధి రాదు అనేది కూడా అపోహ మాత్రమే. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం ప్రమాదకరం. 
 
3. హ్యాండ్ డ్రైయర్స్‌తో చేతుల్ని పొడిగా చేసుకోవడం వల్ల వైరస్ పోతుంది అనేది కూడా అపోహ. సబ్బు నీటితో చేయి కడుక్కోవడం తప్పని సరి. 
 
4. థర్మల్ స్కానర్లు కరోనా వైరస్‌ని గుర్తిస్తాయా?
జ్వరం వచ్చిన వ్యక్తులను మాత్రమే థర్మల్ స్కానర్లు గుర్తిస్తాయి. వ్యాధి బారిన పడి, జ్వరం రాని వారిని గుర్తించలేవు. వ్యాధి బారిన పడినవారు అనారోగ్యానికి గురై జ్వరం రావడానికి 2 నుండి 10 రోజుల మధ్య సమయం పడుతుంది.
 
5. శరీరమంతా ఆల్కహాల్ లేదా బ్లీచింగ్ పౌడర్/క్లోరిన్ చల్లడం వల్ల కరోనా వైరస్‌ను చంపగలమా?
శరీరమంతా ఆల్కహాల్ లేదా క్లోరిన్ చల్లినా, శరీరంలోపలి వైరస్లను చంపలేము. అటువంటి పదార్థాలను చల్లడం బట్టలు లేదా శ్లేష్మ పొరలకు (అంటే కళ్ళు, నోరు) హానికరం. ఉపరితలాలను క్రిమిసంహారక చేయడానికి ఆల్కహాల్ మరియు క్లోరిన్ రెండూ ఉపయోగపడతాయి. అయితే అవి తగిన సిఫారసుల క్రింద ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
 
6. న్యుమోనియా కోసం వేసుకున్న టీకాలు కొత్త కరోనావైరస్ నుండి రక్షిస్తాయనేది అపోహ. కరోనాకి స్వంత టీకాని తయారుచేయడం అవసరం. పరిశోధకులు 2019-nCoVకి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి తయారవ్వలేదు.
 
7. క్రొత్త కరోనావైరస్ సంక్రమణను నివారించడానికి ఉప్పు కలిపిన నీళ్లతో ముక్కును క్రమం తప్పకుండా కడగడం సహాయపడుతుందా?
జలుబుతో ముక్కును క్రమం తప్పకుండా కడగడం వల్ల జలుబు నుండి ప్రజలు త్వరగా కోలుకోగలరని కొన్ని పరిమిత ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి అది సరిపోదు. 
 
8. వెల్లుల్లి తినడం కొత్త కరోనావైరస్ సంక్రమణను నివారించగలదా?
వెల్లుల్లి ఆరోగ్యకరమైన ఆహారం, ఇది కొన్ని యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ వెల్లుల్లి తినడం ప్రజలను కొత్త కరోనావైరస్ నుండి రక్షించిందని ప్రస్తుత వ్యాప్తి నుండి ఎటువంటి ఆధారాలు లేవు.
 
9. కొత్త కరోనావైరస్ వృద్ధులను ప్రభావితం చేస్తుందా, లేదా యువకులు కూడా బారిన పడుతున్నారా?
అన్ని వయసుల వారికి కొత్త కరోనావైరస్ సోకుతుంది. వృద్ధులు, మరియు ముందుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు (ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు వంటివి), వ్యాధి నిరోధకశక్తి తక్కువ ఉన్నవారు ఈ వైరస్‌తో తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. 
 
10. కొత్త కరోనావైరస్ను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉన్నాయా?
లేదు, యాంటీబయాటిక్స్ వైరస్లకు వ్యతిరేకంగా పనిచేయవు. కేవలం బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తాయి. అయినప్పటికీ, మీరు 2019-nCoV కోసం ఆసుపత్రిలో ఉంటే, మీరు యాంటీబయాటిక్స్ పొందవచ్చు ఎందుకంటే బాక్టీరియల్ కో-ఇన్ఫెక్షన్ సాధ్యమే.
 
11. కొత్త కరోనా వైరస్ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఏదైనా నిర్దిష్ట మందులు ఉన్నాయా?
ఈ రోజు వరకు, కొత్త కరోనావైరస్‌ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్దిష్టమైన మందు సిఫారసు చేయబడలేదు. అయినప్పటికీ, వైరస్ సోకిన వారు లక్షణాల నుండి ఉపశమనం పొందటానికి మరియు చికిత్స చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు, సహాయక వైద్యాన్ని పొందాలి.

అన్నింటికంటే ముఖ్యంగా వదంతులను, వాట్సాప్ మెస్సేజులనూ నమ్మకండి. W.H.O సూచనలు పాటించండి. చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవడం, ముక్కు నోరు, కంటిని తాకకుండా ఉండటం, మూడు అడుగుల సామాజిక దూరానికి కట్టుబడి ఉండటం, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ అడ్డుపెట్టుకొని దాన్ని డస్ట్ బిన్‌లో పడేయడం చేస్తూ ఉంటే, కరోనాపై మనమంతా విజయం సాధించవచ్చు.