శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (09:05 IST)

చైనాపై ఉక్కుపాదం.. అనుకున్నంత పని చేసిన డోనాల్డ్ ట్రంప్

చైనాపై అనేక ప్రపంచ దేశాలు ఉక్కపాదం మోపుతున్నాయి. ఇటీవలి కాలంలో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతుండటంతో అనేక ప్రపంచ దేశాలు గుర్రుగా ఉంటున్నాయి. ముఖ్యంగా, భారత్, అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు చైనాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన అనేక యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. ఇపుడు ఇదే బాటలో అమెరికా కూడా నడిచింది. 
 
నిజానికి ఇప్పటికే చైనా - అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం సాగుతోంది. అమెరికాను ఆర్ధికంగా దెబ్బకొట్టాలని చైనా చూస్తోందని అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. అందులోభాగంగానే చైనా కరోనా అనే బయో వైరస్‌ను వుహాన్ ప్రయోగశాలో తయారు చేసిందని బాహాటంగానే ఆరోపించారు. 
 
ఈ క్రమంలో టిక్‌టాక్, వీ చాట్ వంటి మాధ్యమాల ద్వారా అమెరికన్ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వాటిపై నిషేధం విధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 45 రోజుల్లోగా ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. 
 
ఇప్పటికే చైనాకు సంబంధించిన అనేక యాప్స్‌పై ఇండియా ఇప్పటికే నిషేధం విధించింది. మరో 250 రకాల యాప్స్‌ను మానిటరింగ్‌లో పెట్టింది. ఏ క్షణంలో వీటిపై నిషేధం విధిస్తారో తెలియదు. ఇప్పుడు అమెరికా సైతం టిక్ టాక్, వీ చాట్‌లపై నిషేధం విధించటంతో మిగతా దేశాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.